
మాకెందుకు ఈ కష్టాలు!
ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న పింఛన్‌ను ఒక్క సారిగా కూటమి ప్రభుత్వం తొలగించడంతో దివ్యాంగులు అష్టకష్టాలు పడుతున్నారు. బుధవారం వివిధ గ్రామాలకు చెందిన దివ్యాంగులు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని దరఖాస్తులు పూర్తి చేసి అధికారులు అందజేశారు. మండలంలో 194 మంది లబ్ధిదారులను అనర్హత పేరుతో తొలగించారు. పింఛన్, సదరం సర్టిఫికెట్ పునరుద్ధరించేందుకు మరో సారి దరఖాస్తు చేయాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వస్తున్న పింఛన్‌ను తొలగించి మాకెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారని వాపోయారు. లబ్దిదారుల వివరాలు ఆన్‌లైన్ నమోదు చేస్తే విడతల వారీగా దివ్యాంగులకు మళ్లీ రీవెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. వైద్యులు పరీక్షలు చేశాక వైకల్యాన్ని నిర్ధారిస్తారు. 40 శాతం కంటే తక్కువగా ఉంటే పింఛన్ మంజూరు కాదు. ప్రస్తుతం తొలగించిన వాళ్లలో ఎక్కువ భాగం అర్హత ఉన్న వారి పేర్లు గల్లంతయ్యాయి. గతంలో వైద్యులే పరిశీలించి సదరం సర్టిఫికెట్లు మంజూరు చేశారని ఇప్పుడు కొత్తగా ఈ పరీక్షలు ఎందుకని దివ్యాంగులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. – కొలిమిగుండ్ల