నందీశ్వరుడికి పరోక్షసేవ | - | Sakshi
Sakshi News home page

నందీశ్వరుడికి పరోక్షసేవ

Aug 21 2025 6:56 AM | Updated on Aug 21 2025 6:56 AM

నందీశ

నందీశ్వరుడికి పరోక్షసేవ

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల ఆలయ ప్రాంగణంలోని శనగల బసవన్నగా పేరుపొందిన నందీశ్వరునికి శాస్త్రోక్తంగా అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. శుద్ధ త్రయోదశి, బహుళ త్రయోదశి రోజుల్లో నందీశ్వరస్వామి పూజను భక్తులు పరోక్షంగా నిర్వహించుకునే అవకాశం దేవస్థానం కల్పించింది. బుధవారం 28 మంది భక్తులు పరోక్షసేవగా నందీశ్వరస్వామి విశేషపూజను జరిపించుకున్నారు. నందీశ్వర స్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలు, ఫలోదకాలతో అలాగే మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రసమర్పణ విశేషార్చనలను, నానపెట్టిన శనగలను, క్షేత్రపాలకునికి ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించి కర్పూర నీరాజనాలు అర్పించారు.

ఉచిత బస్సులు లేక

మహిళలకు తప్పని తిప్పలు

పత్తికొండ: గంటల తరబడి ఎదురు చూసినా ఉచిత బస్సు ఒక్కటి కూడా రాదు. బస్టాండ్‌లో నిరీక్షించలేక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తికొండ నుంచి గుంతకల్‌, గుత్తి, ఆదోని వైపు వెళ్లడానికి బస్సుల కొరత ఉంది. కొన్ని బస్సులకు మాత్రమే ఉచితం అనుమతి ఇచ్చారు. ఐదు గంటల వరకు ఒక్క బస్సూ రాకపోవడంతో బుధవారం పత్తికొండ బస్టాండ్‌ మహిళలతో కిక్కిరిసి కనిపించింది.

శ్రీశైల ఆలయంలో ఇద్దరిపై వేటు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానంలో కాంట్రాక్ట్‌ పద్ధతిపై పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు కొరఢా ఝలిపించారు. స్వర్ణరథోత్సవం నిర్వహణలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్ట్‌ సహాయ ఇంజినీర్‌ జి.రాజారావు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఐ.శ్రీనివాసును సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 19న నిర్వహించిన స్వర్ణరథోత్సవం కార్యక్రమంలో విధుల్లో ఉండాల్సిన రాజారావు, శ్రీనివాసులు గైర్హాజరైనట్లు ఈఓ గుర్తించారు. ఇంజినీరింగ్‌ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆపరేటర్‌ షెడ్‌ హైడ్రాలిక్‌ షట్టర్‌ను పాక్షికంగా తెరవడంతో స్వర్ణరథోత్సవం పైభాగం చామరము నొక్కుకు పోయింది. ఈ క్రమంలో ఇద్దరిని సస్పెండ్‌ చేస్తూ ఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.

నన్నారి ప్రాసెసింగ్‌ కేంద్రం ప్రారంభం

ఆత్మకూరు/శ్రీశైలం టెంపుల్‌: పట్టణంలోని అర్బన్‌ కాలనీలో నన్నారి ప్రాసెసింగ్‌ సెంటర్‌ను బుధవారం రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఆత్మకూరు ప్రాంత గిరిజనులు స్వయం ఉపాధి లో రాణించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే ఆత్మకూరు ప్రాంతంలో 18 ఎకరాల్లో నన్నారి నర్సరీలను ఏర్పాటు చేశామన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో 7 కేంద్రాల్లో గిరిజనులకు మార్కెటింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో కేంద్రానికి రూ.కోటి కేటాయించామన్నారు. వీటి ద్వారా ఉత్పత్తులు పెంచుకుని గిరిజనులు ఉపాధి పొందాలన్నారు. అనంతరం ఆత్మకూరు పట్టణంలో చెంచుల కోసం ఏర్పాటు చేసిన కుట్టుమిషన్‌, మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ప్రారంభించారు. శ్రీశైలంలోని చెంచు మ్యూజి యం వద్ద గిరిజన బహుళ ప్రయోజన మార్కెటింగ్‌ కేంద్రం నిర్మాణానికి బుధవారం మంత్రి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రాజకుమారి, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గిత్త జయసూర్య, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ భార్గవి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శివప్రసాద్‌, ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్‌ రత్నరాధిక, తదితరులు పాల్గొన్నారు.

నందీశ్వరుడికి పరోక్షసేవ 1
1/1

నందీశ్వరుడికి పరోక్షసేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement