
పేదలపై చిన్న ‘చూపు’
కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోత ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు ఈ కుటుంబానిదే నిదర్శనం. మిడుతూరు మండలం అలగనూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు అంధులు ఉన్నారు. గొల్ల రమణమ్మ, ఆమె ఇద్దరు కుమారులు పెద్ద మద్దిలేటి, నడిపి మద్దిలేటి, కుమార్తె మద్దమ్మ అంధులు. రమణమ్మ భర్త సుబ్బన్ననే భార్యా, పిల్లలను ఇప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ సేవలు అందిస్తున్నారు. పింఛన్‌పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న ఈ కుటుంబానికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అనర్హుల ఏరివేత పేరుతో అర్హులను సైతం లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తుండటంతో దివ్యాంగుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నలుగురికి వంద శాతం వైకల్యం ఉన్నా వికలత్వ శాతం పునః పరిశీలన పేరుతో డాక్టర్లు 40 శాతంగా నిర్ధారించడంతో అధికారులు వచ్చే నెల నుంచి పింఛన్ నిలిపేస్తామని నోటీసులు ఇచ్చారు. దీంతో ఆ నలుగురు ఆందోళన చెందుతున్నారు. తూతూ మంత్రంగా వైద్య పరీక్షలు నిర్వహించి కంటి చూపులేని మా కడుపులు కొట్టడం దారుణమని, ఫించన్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యం తప్ప మరే మార్గం కనిపించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా కలెక్టర్ రాజ్‌కుమారి, ఎమ్మెల్యే జయసూర్య స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేసి, పింఛన్ ఇప్పించాలని కోరుతున్నారు. – నందికొట్కూరు