
హాస్టళ్లలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల భద్రతను మొదటి ప్రాధాన్యతగా స్వీకరించి విధులు నిర్వహించాలని ఆ శాఖ సాధికారత అధికారిణి బి. రాధిక కోరారు. బుధవారం ఉదయం స్థానిక సంక్షేమ భవన్‌లోని తన చాంబర్‌లో ఏఎస్‌డబ్ల్యూఓ, హెచ్‌డబ్ల్యూలతో ఆమె సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, ముఖ్యంగా కొనుగోలు చేస్తున్న వస్తువులపై ఎక్స్‌పైరీ తేది చూసుకోవాలన్నారు. ఇప్పటి వరకు కొత్తగా హాస్టళ్లలో ప్రవేశం పొందిన విద్యార్థుల, ట్యూటర్ల జాబితాలను కూడా పంపలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. పలు హాస్టళ్లలో మెనూ సక్రమంగా పాటించడం లేదని, కోడిగుడ్లు కూడా విద్యార్థులకు పెట్టడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఇప్పటి నుంచి ప్రతి వసతి గృహ సంక్షేమాధికారి రోజుకు రెండు పర్యాయాలు ఎఫ్‌ఆర్‌ఎస్ వేయాల్సి ఉందన్నారు. సెలవు రోజుల్లో మూడు సార్లు ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు చేయాలన్నారు. ఇందుకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని వసతి గృహాల్లో టాయ్‌లెట్లను శుభ్రంగా ఉంచుకోవాలని, బహిరంగ మూత్ర, మల విసర్జనకు అనుమతించరాదన్నారు. సహాయ సంక్షేమాధికారులు ఆయా వసతి గృహాలను తనిఖీ చేసిన రిపోర్టులను పక్కాగా నిర్వహించాలన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు కె. బాబు, ఎస్. లీలావతి, బి.మద్దిలేటి పాల్గొన్నారు.
ప్రస్తుత సీజన్‌లో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి
సాంఘిక సంక్షేమ సాధికారత
అధికారిణి రాధిక