
ఈ బాలుడు అనర్హుడట..
ఈ చిత్రంలోని బాలుడి పేరు షేక్ షాషా..కర్నూలులోని గనిగల్లీకి చెందిన ఈ బాలుడి వయస్సు 15 ఏళ్లు. ఈ బాలుడిని చూస్తే.. ఎవ్వరైనా అయ్యో పాపం అంటారు. పుట్టుకతోనే పోలియో కారణంగా రెండు కాళ్లు పనిచేయవు. లేపడానికి, కూర్చొబెట్టడానికి సహకారం తప్పనిసరి. మామూలుగా అయితే ఈ బాలుడికి హెల్త్ పింఛన్ మంజూరు కావాలి. 2015 సెప్టెంబరు 14న టీడీపీ ప్రభుత్వం హయాంలోనే సదరం క్యాంపునకు వీరి తల్లిదండ్రులు తీసుకపోగా.. 100 శాతం వికలత్వం ఉన్నట్లు నిర్ధారించి సర్టిఫికెట్ ఇచ్చారు. రీ వెరిఫికేషన్‌లో భాగంగా సదరం క్యాంపునకు వెళ్లిన డాక్టర్లకు పోలియోతో పోయిన షేక్ షాషా కాళ్లు గమనించకుండా.. వికలత్వం తాత్కాలికమేనంటూ.. 40 శాతం లోపే వికలత్వ శాతం ఇచ్చారు. దీంతో పింఛన్ రద్దు అయిందంటూ మున్సిపల్ కమిషనర్ నోటీసు ఇచ్చారు. డాక్టర్లు కళ్లుండి చూసే సదరం సర్టిిఫికెట్ ఇచ్చారా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. సదరం క్యాంపుల్లో డాక్టర్లు నిజాయితీ, చిత్తశుద్ధితో వ్యవహరించారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. – కర్నూలు(అగ్రికల్చర్)