
రైతు ఆత్మహత్యాయత్నం
కోవెలకుంట్ల: మండలంలోని ఎం. గోవిందిన్నెకు చెందిన ఓ రైతు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధిత రైతు వెంకటరమణ ఆచారి అందించిన సమాచారం మేరకు.. గ్రామ శివారులోని 420 సర్వేనంబర్‌లో గ్రామానికి చెందిన మునెమ్మకు 47 సెంట్లు భూమి ఉంది. ఆమెకు వెంకటరమణ ఆచారి, రామచంద్ర ఆచారి, సుబ్బరాయుడు ముగ్గురు సంతానం. ఇటీవల అనారోగ్యంతో మునెమ్మ మృతి చెందింది. ముగ్గురు కుమారులు ఆ భూమిని సమాన భాగాలుగా పంచుకోవాల్సి ఉంది. ప్రస్తుతం పొలం వెంకటరమణ ఆచారి ఆధీనంలో ఉంది. అదే గ్రామానికి చెందిన నాగరత్నం ఆచారికి పక్కనే పొలం ఉంది. చిన్నకొప్పెర్లకు చెందిన కొందరు వ్యక్తుల ప్రోద్బలంతో నాగరత్నం ఆచారి దౌర్జన్యంగా పొలంలోకి దిగి ట్రాక్టర్‌తో దున్ని ఆక్రమించుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన వెంకట రమణ ఆచారి క్రిమి సంహారక మందు తాగి ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. రైతు ఆత్మహత్యయత్న సంఘటనపై రేవనూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు.