
గిరిజన సంక్షేమానికి కృషి
శ్రీశైలం టెంపుల్: రాష్ట్రంలోని గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని గిరిజన, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం శ్రీశైల దేవస్థాన పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమం, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్.భార్గవి, జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శివప్రసాద్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. అనంతరం పలువురు గిరిజన నాయకులు, సంఘాల నాయకుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సమీక్ష అనంతరం మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఐటీడీఏల వద్ద రూ.కోటి నిధులతో గిరిజన ఉత్పత్తుల మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా శ్రీశైలంలో గిరిజన ఉత్పత్తుల మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తానన్నారు. అలాగే ఆత్మకూరు వద్ద బైర్లూటీలో 1500 మంది గిరిజనుల కోసం నన్నారి జ్యూస్ పరిశ్రమను ప్రారంభించనున్నట్లు తెలిపారు. శ్రీశైల దేవస్థానంలో చెంచు, గిరిజనులకు దుకాణాలు ఉన్నాయని, వాటి సంఖ్య పెంచడంతో పాటు మినిమం అద్దె చెల్లించే విధంగా ఈఓకు సూచించామన్నారు. అలాగే ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్‌తో కలిసి శ్రీశైలం ఐటీడీఏ ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.