
ఆ వీఆర్‌ఓ రూటే సపరేటు
● ఒక్కో డీ పట్టాకు రూ.50 వేలు ● జాయింట్ ఎల్‌పీ నంబరు విడగొడితే రూ.20 వేలు ● పైసలిస్తే చాలు ప్రభుత్వ భూములైనా ఆన్‌లైన్‌లో ఎక్కిచ్చేస్తాడు
నంద్యాల(అర్బన్): స్థానిక రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఓ ద్వితీయ శ్రేణి అఽధికారి వీఆర్‌ఓ లంచావతారమెత్తాడు. జాయింట్ ఎల్‌పీ నంబరును విడగొట్టేందుకు రూ.20 వేలు, ఒక్కో డీ పట్టాకు రూ.50 వేలు, చిన్నచిన్న పనులకు రూ.10 వేలు గుంజుతున్నాడు. పైసలిస్తే చాలు ప్రభుత్వ భూములైనా పట్టా భూములైనా ఇతరులకు ఆన్‌లైన్ చేస్తాడు. ఏడాది క్రితం సాధారణ బదిలీల్లో భాగంగా గాజులపల్లె గ్రామ వీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తూ నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. జాతీయ రహదారి సమీపంలో ఉన్న గ్రామ వీఆర్‌ఓగా ఉంటూ అసైన్డ్ భూముల్లో అవినీతి పొజిషన్ సర్టిఫికెట్ల పేరుతో విక్రయాలు, ఉద్దేశపూర్వకంగా తప్పులు సృష్టించి రైతుల వద్ద నుంచి డబ్బులు గుంజడం, సమస్యలపై సచివాలయానికి వచ్చే రైతుల నుంచి దలారుల ద్వారా డబ్బులు వసూలు చేయడం అత్యవసరమంటే ఇప్పుడు కాదు.. టైం పడుతుందంటూ అమౌంట్లను సెటిల్ చేసుకోవడం అలవాటుగా మారింది. ఇటీవల జాయింట్ ఎల్‌పీ నంబర్లను విడగొట్టేందుకు స్థానిక కో–ఆప్షన్ మెంబర్ వద్ద నుంచి రూ.15 వేలు తీసుకున్నట్లు తెలిసింది. సర్వే నంబర్ 21/1లోని 1.99 ఎకరాల వంక పోరంబోకు భూము ల్లో ఇళ్ల స్థలాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేందుకు, సర్వే నంబర్ 109/1లోని 1.84 ఎకరాల సీలింగ్ ల్యాండ్ భూములకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా ప్లాట్ల ఏర్పాటుకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు సమాచారం.
అగ్రికల్చర్ ల్యాండ్‌ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్‌గా మార్పు చేయడం, భూమిని చేతులు మార్చడంలో ఆయనకు ఆయనే సాటి. పొలాలకు సంబంధించి మ్యూటేషన్ పనులు పూర్తి చేస్తామంటూ ఓ రైతు వద్ద నుంచి రూ.20 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఇలా ఒకటేమిటి అన్ని పనులకు చేయి తడపాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రధాన జాతీయ రహదారి సమీపంలోని వాగు పోరంబోకు, సీలింగ్ ల్యాండ్, ఇనాం భూముల్లో పట్టాల ఏర్పాటులో వీఆర్‌ఓకు రూ.లక్షల్లో చేతులు మారాయన్న ఆరోపణలు వినబడుతున్నాయి. పొలాలకు సంబంధించి మ్యూటేషన్ పూర్తి చేసే ఏర్పాటులో భాగంగా రైతులు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ వద్దకు వెళితే వీఆర్‌ఓను కలిసిన తర్వాతనే మ్యూటేషన్ పనులు పూర్తవుతాయంటూ చెబుతుండటం, రైతులను ఆందోళనలకు గురి చేస్తోంది. పది సెంట్ల చొప్పున తేడాలు వచ్చే భూముల కొలతలను సరిచేసేందుకు వేలకు వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు ముట్టనిదే ఆయన ఏపని చేయరని బహిరంగ విమర్శలు వినబడుతున్నాయి. డీపట్టాలు కొన్న వారి పేర్లను సైతం రికార్డుల్లో ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన అనుకుంటే రికార్డులను సైతం తారుమారు చేస్తారన్న విమర్శలున్నాయి. భూములను సైతం ఆన్‌లైన్‌లో ఎక్కిస్తానంటూ వాటికి ఆనుకొని ఉన్న రైతులకు సమాచారం ఇచ్చి ముడుపులు దన్నుకుంటున్నాడని తెలుస్తోంది. 1431, 32, 33, 34, 35 పసిలీలకు పన్నులు వేసి రైతుల వద్ద నుంచి ముక్కుపిండి వసూలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించి ఇలాంటి అవినీతి తిమింగాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.