దివ్యాంగులను ఏడి‘పింఛెన్‌’ | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులను ఏడి‘పింఛెన్‌’

Aug 20 2025 5:24 AM | Updated on Aug 20 2025 5:24 AM

దివ్యాంగులను ఏడి‘పింఛెన్‌’

దివ్యాంగులను ఏడి‘పింఛెన్‌’

కర్నూలు జిల్లాలో 4731, నంద్యాల జిల్లాలో 4099 పింఛన్ల రద్దు

రోడ్డెక్కుతున్న దివ్యాంగులు

మనోవేదనతో చాగలమర్రిలో దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం

కర్నూలు(అగ్రికల్చర్‌): పింఛన్ల అడ్డగోలు తొలగింపులపై దివ్యాంగులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు. మాకు అర్హత ఉంది అయినా పింఛన్‌ తొలగించారంటూ శారీరక దివ్యాంగులు, అంధులు, చెవిటి – మూగ వారు ఒకవైపు మండల పరిషత్‌ కార్యాలయాలు, మరోవైపు జిల్లా కలెక్టర్‌, డీఆర్‌డీఏ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఇంకా వందలాది మంది దివ్యాంగులు నోటీసులు అందుకోలేదు. దీంతో రానున్న రోజుల్లో ఆందోళనలు వెళ్లువెత్తే అవకాశం ఉంది. డోన్‌, మద్దికెర, ఆదోని, తుగ్గలి తదితర మండలాల్లో దివ్యాంగులు ఉద్యమ బాట పట్టారు. కూటమి ప్రభుత్వం నోటి దగ్గరి ముద్ద లాగేసుకోవడంపై వేలాది మంది కన్నీరుమున్నీరవుతున్నారు. పింఛన్‌ రద్దు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దివ్యాంగుడొకరు పురుగు మందు తాగడం సంచలనం సృష్టిస్తోంది. నంద్యాల జిల్లా చాగలమర్రిలో మహబూబ్‌బాషా అనే దివ్యాంగుడు పింఛన్‌ రద్దు కావడంతో జీర్ణించుకోలేక పురుగు మందు తాగారు. గతంలో ఇచ్చిన సదరం ధృవపత్రంలో వికలత్వం 72 శాతం ఉండగా ఇప్పుడు రీ అనాలసిస్‌లో 40 కంటే తక్కువకు పడిపోయింది. దీంతో సచివాలయ ఉద్యోగులు పింఛన్‌ రద్దయ్యిదంటూ నోటీసు చేతిలో పెట్టారు. నోటి దగ్గరి ముద్దను లాగేసుకున్నట్లుగా జీవనాధారమైన పింఛన్‌ రద్దు కావడంతో తట్టుకోలేక పురుగు మందు తాగడం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కలకలం రేపింది. ఈయన పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 8830 దివ్యాంగుల కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. జీవనాధారమైన పింఛన్‌ రద్దు కావడంతో దివ్యాంగుల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది.

● కర్నూలు జిల్లాలో 4731 దివ్యాంగ పింఛన్లలపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. కర్నూలు జిల్లాలో దివ్యాంగ పింఛన్‌ తీసుకుంటున్న 674 మందిని వృద్ధాప్య పింఛన్‌లుగా మార్పు చేశారు. రూ.15 వేలు హెల్త్‌ పించన్‌లు తీసుకుంటున్న వారిలో 17 మందికి అనర్హత వేటు వేశారు.

● నంద్యాల జిల్లాలో 4099 దివ్యాంగ పింఛన్‌లపై అనర్హత వేటు పడింది. నంద్యాల జిల్లాలో దివ్యాంగ పింఛన్లు 25,256 ఉండగా 22,411 మంది పింఛన్‌దారులను రీ వెరిఫికేషన్‌ చేశారు. ఇందులో 4099 పింఛన్‌దారులను అనర్హులుగా తేల్చారు. 719 దివ్యాంగుల పింఛన్‌లను వృద్ధాప్య పింఛన్‌లుగా మార్పు చేశారు. నంద్యాల జిల్లాలో హెల్త్‌ పింఛన్‌లు 873 ఉండగా అన్నింటినీ వెరిఫై చేశారు. ఇందులో 64 హెల్త్‌ పింఛన్‌లకు అనర్హత ఉన్నట్లు తేల్చారు. 323 హెల్త్‌ పింఛన్‌లను దివ్యాంగ పింఛన్లుగా మార్పు చేశారు. మరో 20 హెల్త్‌ పింఛన్‌లను వృద్ధాప్యం కిందకు మార్చారు.

● హెల్త్‌ పింఛన్లకు రూ.15 వేలు ఇవ్వాల్సి ఉండగా దివ్యాంగ పింఛన్లకు మార్చడం వల్ల కేవలం రూ.6 వేలు మాత్రమే ఇస్తారు. తద్వారా ఒకరి పింఛన్‌ నుంచి ప్రభుత్వం రూ.9 వేలు కోత పెడుతుంది.

● దివ్యాంగ పింఛన్లకు రూ.6 వేలు ఇవ్వాల్సి ఉండగా వృద్ధాప్యం కిందకు మార్చడంతో రూ.4 వేలు మాత్రమే ఇస్తారు. తద్వారా ఒకరి పింఛన్‌ సొమ్ములో రూ.2 వేలు కోత పడుతుంది. పింఛన్‌ లబ్ధిదారుల సంఖ్య, వారికిచ్చే సొమ్మును తగ్గించేందుకు ప్రభుత్వం ఇలాంటి కుట్రలు పన్నుతున్నట్లు పింఛనుదారులు వాపోతున్నారు.

డోన్‌ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ధర్నా చేస్తున్న దివ్యాంగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement