
కర్నూలులో అక్రమ రిజిస్ట్రేషన్లు
కర్నూలు కల్చరల్: జిల్లా కేంద్రమైన కర్నూలులో కొన్ని స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, రామప్రియనగర్‌లో ఇది ఎక్కువగా ఉందని, చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషాకు ప్రజలు అర్జీ ఇచ్చారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు జేసీ డాక్టర్ బి.నవ్య ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటికి తగు పరిష్కారాలు చూపాలని అధికారులను ఆదేశించారు. కృష్ణానగర్ రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర నుంచి ఐటీసీ సర్కిల్ వరకు ఉన్న రోడ్లు గుంతలు ఏర్పడి, రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, అధికారులు స్పందించాలని ప్రజలు అర్జీ ఇచ్చారు. అలాగే భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునః ప్రారంభించి, జీవో నెంబర్ 17ను రద్దు చేయాలని, నాణ్యత, పరిశుభ్రం పాటించని హోటల్స్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు వినతి పత్రాలు అందజేశారు. అర్జీల స్వీకరణ అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడారు. లాగిన్‌లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌వో సి.వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సమస్యను పరిష్కరించాలని
జిల్లా కలెక్టర్‌కు అర్జీ ఇచ్చిన ప్రజలు