
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చ
● ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ కృష్ణయ్య
కర్నూలు(సెంట్రల్): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపై జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషాతో కలసి ఆయన స్టాక్ హోల్డర్స్‌తో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాలు, నగరాల్లో అధిక జనాభాతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం అధికమైందని, స్టాక్ హోల్డర్లు, అధికారులు సమన్వయంతో పని చేసి అడ్డుకట్ట వేయాలన్నారు. గతంలో గుడ్డ సంచులు, వైర్ బ్యాగులను మార్కెట్‌కు తీసుకెళ్లేవారమని, ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులతో ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు, ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్‌లు, దేవాలయాలు, హోట ళ్లు, చికెన్ షాపుల్లో ఎక్కువగా జ్యూట్ బ్యాగులు, బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులను అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించేలా పంచాయతీల్లో అవగాహన కల్పించాలని డీపీఓను ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ పరిశ్రల్లో భాగంగా జూట్, డిగ్రేడబుల్ బ్యాగులు తయారు చేసే వారికి ప్రోత్సాహం ఇవ్వా లని చెప్పారు. కలెక్టర్ పి.రంజిత్‌బాషా మాట్లాడుతూ.. జిల్లాలో అక్టోబర్ 2వ తేదీనాటికీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమలో పీసీబీ ఈఈ కిశోర్‌రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్, గనుల శాఖ డీడీ రవిచంద్, డీఎస్‌ఓ రఘువీర్, డీపీఓ భాస్కర్, డీటీసీ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.