
ఆడబిడ్డ నిధి లేనట్లే..
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 నేరుగా మీ ఖాతాలో జమచేస్తాం. మీ ఇంటిలో ఇద్దరు ఉంటే ఇద్దరికి, ముగ్గురు ఉంటే ముగ్గురికి కూడా ఈ మొత్తాన్ని అందిస్తాం. 18 నుంచి 59 ఏళ్లలోపు వయస్సు మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకాన్ని వర్తింపజేస్తాం.’’ అంటూ 2024 మే నెలలో జరిగిన ఎన్నికల సమయంలో అన్ని ప్రచార సభల్లోనూ కూటమి నేతలు హోరెత్తించారు. నీకు.. నీకు.. నీకు అంటూ వేలితో చూపించి మీ అకౌంటుకు నెలకు రూ.1,500 ప్రకారం వేస్తామని ఊరూవాడా నమ్మబలికారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు 14 నెలలు అవుతోంది. ఇంతవరకు ఆడబిడ్డనిధి జాడ లేకుండాపోయింది. కూటమి నేతల వైఖరి చూస్తే ఆడబిడ్డ నిధిని గంగలో కలిపినట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని అమలు చేయలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మళ్లించేందుకు పీ–4 కార్యక్రమాన్ని తెరమీదకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దాతల దయాదాక్షిణ్యాల మీద బతికే దుస్థితి తీసుకురావడం పట్ల మహిళల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో రైస్‌కార్డులు కలిగిన కుటుంబాలు దాదాపు 16 లక్షల వరకు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవే. అయితే బంగారు కుటుంబాలుగా కర్నూలు జిల్లాలో 64,178, నంద్యాల జిల్లాలో 43,021 కుటుంబాలను మాత్రమే ఎంపిక చేయడం గమనార్హం.
బలవంతపు దత్తత
ఆడబిడ్డ నిధి సహా వివిధ ఎన్నికల హామీలకు మంగళం పలుకుతున్న కూటమి ప్రభుత్వం మహిళల దృష్టి మళ్లించేందుకు పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్, పార్టనర్‌షిప్(పీ4)ను తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదు. కార్పొరేట్ కంపెనీలు, పరిశ్రమల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకొని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలి. దాతల దయాదాక్షిణ్యాల మీద ఈ కుటుంబాలు బతికే దుస్థితికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 64,178, నంద్యాల జిల్లాలో 43,021 కుటుంబాలను అత్యంత నిరుపేద కుటుంబాలుగా ఆయా జిల్లాల యంత్రాంగం ఎంపిక చేసింది. ఇందులో కర్నూలు జిల్లాలో 34,385, నంద్యాల జిల్లాలో 40,231 కుటుంబాలను దాతలు దత్తత తీసుకున్నారు. ఇందుకోసం కర్నూలు జిల్లాలో 4,443, నంద్యాల జిల్లాలో 5,150 మంది మార్గదర్శలను ఎంపిక చేశారు. బలవంతంగా మార్గదర్శకులను ఎంపిక చేస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
విజయవంతంగా వైఎస్‌ఆర్ చేయూత
గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 18–59 ఏళ్ల వయస్సు మహిళలకు వైఎస్‌ఆర్ చేయూత పథకాన్ని అమలు చేసింది. ఒక్కో మహిళకు ఏడాదికి రూ.18,870 ప్రకారం విడుదల చేసిది. నాలుగేళ్లలో వైఎసార్ చేయూత కింద రూ.1,954.92 కోట్లు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం విశేషం. వైఎసార్ చేయూత పథకాన్నే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడబిడ్డ నిధిగా మార్పు చేశారు. 18–59 ఏళ్ల వయస్సు మహిళలు కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ నెలకు రూ.1,500 ప్రకారం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి నమ్మించడం గమనార్హం.
2024 ఎన్నికల సమయంలో ఊరూవాడ మారుమోగిన ఆడబిడ్డ నిధి పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళం పలికినట్లేనని టీడీపీ నేతలే పేర్కొంటున్నారు. ఈ పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సిందేనని ఇటీవల వ్యవసాయ అనుబంధ శాఖల మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొనడం పట్ల మహిళల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని 2024–25లో ఎగ్గొట్టి.. 2025–26లో అరకొరగా అమలు చేసింది. ఆడబిడ్డ నిధికి పూర్తిగా మంగళం పలుకుతుండటం పట్ల మహిళల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.