
పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసుకోండి
కర్నూలు: జిల్లాలోని అన్ని బ్యాంకులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ బ్యాంకర్లకు సూచించారు. బుధవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా వంటి రాష్ట్రాల్లో హైవే పక్కన ఉన్న బ్యాంకుల్లో జరిగిన దొంగతనాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం మాట్లాడుతూ బ్యాంకు లోపల, బయట మన్నిక కలిగిన సెన్సర్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. బ్యాంకుల్లో దొంగలు పడిన వెంటనే బ్యాంకు వారికి మెసేజ్‌లు, అలర్ట్స్ వచ్చేలా భద్రత చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి బ్యాంకులో సెక్యూరిటీ గార్డు ఉండాలన్నారు. కొందరి ఖాతాల్లో పెద్ద మొత్తాల్లో లావాదేవీలు జరిగినప్పుడు బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరగాళ్ల గురించి ఖాతాదారులను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులందరూ బ్యాంకులను సందర్శించి సెక్యూరిటీ పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించాలన్నారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, ఎస్‌బీఐ మేనేజర్ అబ్దుల్ రవూఫ్, కరూర్ వైశ్య బ్యాంక్ అధికారి పీరయ్య, సీఐలు తేజమూర్తి, రామయ్య నాయుడు, నాగరాజ రావు, శ్రీధర్, విక్రమ సింహ, చంద్రబాబు నాయుడు, మన్సూరుద్దీన్, నాగశేఖర్, సైబర్ ల్యాబ్ అధికారి వేణుగోపాల్, సిబ్బంది పాల్గొన్నారు.
బ్యాంకర్లకు ఎస్పీ సూచన

పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసుకోండి