
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
దొర్నిపాడు: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని భాగ్యనగరం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. భాగ్యనగరం గ్రామానికి చెందిన రామాంజనేయులు (40), భార్య ప్రభావతమ్మ నిత్యం గొడవలు పడేవారు. రోజులాగే మంగళవారం రాత్రి వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇద్దరు కొడుకులను వెంట పెట్టుకొని ప్రభావతమ్మ వేరే ఇంటికి వెళ్లిపోయింది. ఈ స్థితిలో అతని తమ్ముడు నాగాంజనేయులు ఇంటికి వెళ్లి చూసేసరికి రామాంజనేయులు రక్తగాయాలతో మృతి చెంది పడి ఉండటం చూసి భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్‌ఐ వరప్రసాద్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నాగాంజనేయులు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ వెల్లడించారు.