ఏసీబీ వలలో సీనియర్‌ అసిస్టెంట్‌ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో సీనియర్‌ అసిస్టెంట్‌

Aug 1 2025 1:41 PM | Updated on Aug 1 2025 1:41 PM

ఏసీబీ వలలో సీనియర్‌ అసిస్టెంట్‌

ఏసీబీ వలలో సీనియర్‌ అసిస్టెంట్‌

జూపాడుబంగ్లా: రైతు నుంచి రూ.40వేల లంచం తీసుకుంటూ ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ రమేష్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సోమన్న, బాధిత రైతు ఈశ్వరయ్య తెలిపిన వివరాలివీ.. జూపాడుబంగ్లాకు చెందిన శంకరమ్మకు 80బన్నూరు రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్‌ 568/ఏలో 0.70 సెంట్లు, 568/సీలో 0.30సెంట్ల పొలం ఉంది. వీరు ఈ పొలాన్ని పూర్వం నుంచి అనుభవిస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌ అడంగల్‌లో రెవెన్యూ అధికారులు జూపాడుబంగ్లాకు చెందిన లింగన్న పేరిట నమోదు చేశారు. తమకు వారసత్వంగా వస్తున్న రిజిష్టర్‌ భూమిని తిరిగి తమ పేరిట ఎక్కించాలని రైతు ఈశ్వరయ్య 2021 నుంచి జూపాడుబంగ్లా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్‌ఓఆర్‌ విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయానికి రెఫర్‌ చేశారు. అయితే పేరును చేర్చేందుకు రూ.70వేలు లంచం డిమాండ్‌ చేశారు. తాను అంత మొత్తం ఇచ్చుకోలేనని రూ.30వేలు ఇస్తానని పేర్కొన్నట్లు బాధిత రైతు తెలిపాడు. చివరికి రూ.50వేలకు బేరం కుదిరింది. అందులో భాగంగా రూ.10వేల అడ్వాన్స్‌ను ఆర్డీఓ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ రమేష్‌కు ఇచ్చాడు. మిగిలిన రూ.40వేల నగదు రైతు ఈశ్వరయ్య వద్ద తీసుకొని తనకు ఇవ్వాలని ఆర్డీఓ ఆదేశించినట్లు ఏసీబీకి పట్టుబడిన సీనియర్‌ అసిస్టెంట్‌ రమేష్‌ ఏసీబీ అధికారులకు తెలిపాడు. రమేష్‌ ఒత్తిడి తాళలేక రైతు కర్నూలు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

వల పన్నిన ఏసీబీ

ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు గురువారం ఈశ్వరయ్యకు రూ.40వేల నగదు ఇచ్చి పంపించారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న సూచనల మేరకు రైతు ఆర్డీఓ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ రమేష్‌కు గురువారం ఫోన్‌చేసి డబ్బులు ఎక్కడకు తెచ్చిమ్మంటారని అడిగాడు. అందుకాయన తాను నందికొట్కూరు నుంచి ఏపీ 40 డీఏ 5036 నెంబర్‌ కారులో ఆత్మకూరుకు వెళ్తున్నానని, జూపాడుబంగ్లాకు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకొంటానన్నాడు. జూపాడుబంగ్లా జంగాల పెద్దన్న ఇంటికి సమీపంలో ఈశ్వరయ్య వేచి చూస్తుండగా అక్కడకు కారులో వచ్చిన రమేష్‌ రైతు ఇచ్చిన రూ.40వేల నగదును తీసుకొని ఆత్మకూరుకు బయలుదేరాడు. డబ్బులు ఇచ్చిన వెంటనే ఈశ్వరయ్య ఏసీబీ అధికారులకు ఫోన్‌చేయటంతో వారు జూపాడుబంగ్లా బస్టాండు వద్ద రమేష్‌ను అదుపులోకి తీసుకొన్నారు. అతని నుంచి రూ.40వేల నగదును స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు.

ఆర్డీఓ ఒత్తిడితోనే...

ఏసీబీకి పట్టుబడిన రమేష్‌ మాట్లాడుతూ.. రైతు ఈశ్వరయ్య వద్ద డబ్బులు ఇప్పించుకొని రావాలని ఆర్డీఓ నాగజ్యోతి ఒత్తిడి చేయటంతో తాను డబ్బు తీసుకొన్నానని తెలిపాడు. లంచం ఇస్తేనే పని చేస్తానని రైతు ఈశ్వరయ్యపై ఆర్డీఓ ఒత్తిడి చేయటం వల్లే తానే ఏసీబీ వద్దకు వెళ్లాలని రైతుకు సలహా ఇచ్చినట్లు పేర్కొనటం గమనార్హం. ఇదిలాఉంటే ఆర్డీఓ విషయమై ఏసీబీ డీఎస్పీ సోమన్నను ‘సాక్షి’ ప్రశ్నించగా.. ఆర్డీఓ స్వయంగా లంచం డిమాండ్‌ చేసినట్లు తగిన ఆధారాలు లేవన్నారు. అందువల్ల ఆమైపె కేసు నమోదు చేయడం లేదని తెలిపారు.

రైతు వద్ద రూ.40వేల

లంచం డిమాండ్‌

ఆర్డీఓ చెప్పినందుకే తీసుకున్నట్లు

సీనియర్‌ అసిస్టెంట్‌ వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement