
హాస్టళ్లలో పురుగుల అన్నం.. నీళ్ల చారే గతి
కర్నూలు(సెంట్రల్): సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు పురుగుల అన్నం, నీళ్ల చారే దిక్కు అయ్యిందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్, రాష్ట్ర కార్యదర్శి కటారుకొండ సాయికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులు కటిక నేలపైనే నిద్రిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కర్నూలులోని కలెక్టరేట్ ఎదుట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మణిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కటికె గౌతమ్‌తో కలసి వారు మాట్లాడారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హాస్టళ్లను సందర్శించి పలు సమస్యలను తెలుసుకున్నామన్నారు. విద్యార్థులకు ఇంతవరకు బెడ్ సీట్లు, ట్రంకు పెట్టెలు, భోజనం ప్లేట్లు ఇవ్వలేదన్నారు. ఎక్కడా కిటికీలకు డోర్లు లేవని, బాత్‌రూంలు తెరుచుకోవడం లేదని, మరుగుదొడ్లు పనిచేయడం లేదని తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమ హాస్టళ్లకు అనేక వసతులు కల్పించారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ శివరాముడుకు వినతిపత్రం ఇచ్చారు.