
ఉపాధ్యాయుడైన జిల్లా కలెక్టర్
పత్తికొండ రూరల్: ఉపాధ్యాయుడిగా మారి జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా విద్యార్థులకు పాఠాలు చెప్పారు. పత్తికొండ మండల పరిధిలోని దూదేకొండ గ్రామంలో హైస్కూల్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రోత్సాహకాలు అందించారా, మెనూ ప్రకారంగా భోజనం అందుతుందా అనే విషయాలు తెలుసుకున్నారు. బోర్డు మీద కొన్ని ప్రశ్నలు రాసి విద్యార్థుల నుంచి జవాబులు రాబట్టారు. పాఠశాల ప్రాంగణంలో బండరాళ్లు, చెత్తా చెదారాన్ని తొలగించాలని ఆర్డీఓ భరత్‌నాయక్, ఎంఈఓ గాజుల రమేష్‌ను ఆదేశించారు. అంతకు ముందు గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్‌తో కలిసి పింఛన్‌ను అందజేశారు. కనకదిన్నె గ్రామంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటును, అలాగే పందికోన రిజర్వాయర్‌ను, పత్తికొండలోని ప్రభుత్వాసుపత్రిని పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యలు..
పాఠశాల అప్‌గ్రేడ్ అయ్యిందని, అదనపు తరగతి గదుల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని జిల్లాకలెక్టర్‌కు సర్పంచ్ ముజుబుర్ రహిమాన్ తెలిపారు. వితంతు పింఛన్లు ఇవ్వాలని దూదేకొండ గ్రామానికి చెందిన లక్ష్మిదేవి, సుశీలమ్మ, అరుణ, మాధవి కోరారు. పందికోన రిజర్వాయర్ కింద ఎడమ కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసి పొలాలకు నీరు అందించాలని రైతులు వినతిపత్రాన్ని అందజేశారు.