
ఊపిరిపై క్యాన్సర్ కాటు
పొగతాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది క్యాన్సర్ కారకం.. అని బీడీ, సిగరెట్, చుట్టల పెట్టెలపై ముద్రిస్తున్నా జనం మారడం లేదు. వాటికి అలవాటుపడిన వారు వ్యసనాన్ని వదలడం లేదు. కానీ అలవాటు ఊపిరితిత్తులను పొగతో కమ్మేసి క్రమంగా క్యాన్సర్‌గా రూపాంతరం చెందుతోంది. ధూమపానంతో వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే పొగ కాలుష్యంగా మారి మనిషి ప్రాణాలు తీస్తోంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి గల కారణాలు, తీసుకునే చికిత్సలపై అవగాహన పెంచేందుకు ఏటా ఆగస్టు ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కథనం. – కర్నూలు(హాస్పిటల్)
● పెరుగుతున్న ఊపిరితిత్తుల
క్యాన్సర్ బాధితులు
● ధూమపానమే ప్రధాన కారణం
● వాతావరణ కాలుష్యం కూడా..
● నేడు ప్రపంచ ఊపిరితిత్తుల
క్యాన్సర్ దినోత్సవం
క్యాన్సర్ ఇదో భయంకర మహమ్మారి. 50 ఏళ్ల క్రితం వరకు ఎక్కువగా ధనికులకు మాత్రం వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు పేద, మధ్యతరగతి వర్గాలను వదలడం లేదు. ఏటా క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వ్యాధి నిర్ధారణ అవకాశాలు సులభం కావడం కూడా సంఖ్య పెరగడానికి కారణమైంది. ఈ వ్యాధితో బాధపడిన వారు త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే మనగలుగుతున్నారు. చివరి దశలో బయటపడితే మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రతిరోజూ నిర్వహించే ఓపీకి 30 మంది దాకా రోగులు వస్తున్నారు. ఇందులో 20 మంది కొత్త వారే ఉంటున్నారు. అంటే ప్రతి నెలా 500 నుంచి 600 మంది, ఏడాదికి 6వేలకు పైగా కొత్తరోగులు పుట్టుకొస్తున్నారు. వీరిలో 6 శాతం మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే వారిలో అధిక శాతం మూడవ దశ, నాల్గవ దశలలో చికిత్స కోసం వస్తుండగా ఎక్కువ మంది కోలుకోలేక మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్‌కు చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో ఇద్దరు సర్జికల్ ఆంకాలజిస్టులు ఉన్నారు. వీరు ఊపిరితిత్తుల్లో ఏర్పడిన క్యాన్సర్ కణితులను తొలగించడం, దెబ్బతిన్న ఊపిరితిత్తిలోని కొంత భాగాన్ని తీసివేయడం చేసి అనంతరం కీమోథెరపి చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రితో పాటు కర్నూలు నగరంలోని ఒమెగా హాస్పిటల్, విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్, అమీలియో క్యాన్సర్ హాస్పిటల్‌లలోనూ ఎన్‌టీఆర్ వైద్యసేవ ద్వారా ఉచితంగా క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లోనూ ప్రతిరోజూ కొత్త, పాత రోగులు 150 నుంచి 200 మంది చికిత్స కోసం వస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
ప్రాణాలు తోడేస్తున్న పొగ
స్నేహితులతో సరదాగా మొదలయ్యే పొగతాగే అలవాటు క్రమంగా అలవాటుగా మారి ఆ తర్వాత బానిసను చేసుకుంటుంది. దీనిని వదిలించుకుందామన్నా వదలలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. కొందరు రోజుకు ఒక ప్యాకెట్/కట్ట తాగుతుండగా మరికొందరు నాలుగైదు పెట్టెలు కాల్చందే మనసు ఊరుకోని పరిస్థితి. ధూమపానం చేసేవారిలో చేయని వారికంటే ఊపరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 24 నుంచి 35 రెట్లు ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వారు వదిలిన గాలి పీల్చడం(పాసివ్ స్మోకింగ్) ద్వారా 3.5శాతం క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీంతో పాటు గాలి కాలుష్యం, గతంలో చేసిన రేడియేషన్ థెరపి, వంటచేసే సమయంలో ఉత్పత్తి అయ్యే రాడన్ గ్యాస్ పీల్చడం, ఆర్సెనిక్ క్రోమియం, నికెల్ ఆస్బెస్టాస్, ఇతర పదార్థాలు పీల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
వ్యాధి లక్షణాలు–సంకేతాలు
ఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణంగా దాని ప్రారంభ దశలలో సంకేతాలు, లక్షణాలను కలిగించదు. వ్యాధి తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ చికిత్సకు లొంగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. నిరంతర దగ్గు, దగ్గినప్పుడు రక్తం పడటం, శ్వాస ఆడకపోవడం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గిపోవడం, ఎముకల నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం లక్షణాలు ఉంటాయి.
వ్యాధి నిర్ధారణ, చికిత్స
ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశమున్న వారు ఏడాదికి ఒకసారి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలను బట్టి వైద్యుల సూచనల మేరకు ఛాతి ఎక్స్‌రే, ఛాతి సీటీ స్కాన్, కఫం సైటోలజీ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ రకాన్ని గుర్తించేందుకు టిష్యూ బయాప్సీ అవసరం అవుతుంది. చికిత్స ఆ క్యాన్సర్ దశపై ఆధారపడి ఉంటుంది. ఈ క్యాన్సర్‌కు ప్రస్తుతం శస్త్రచికిత్స, కీమోథెరపి, రేడియోథెరపి విధానాల్లో చికిత్స అందిస్తున్నారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ రకాలు
స్మాల్‌సెల్ లంగ్ క్యాన్సర్: ఇది చిన్న కణాల ఊపిరితిత్తుల క్యాన్సర్, దాదాపుగా ఎక్కువగా ధూమపానం చేసేవారిలో ఇది సంభవిస్తుంది.
నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్: ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్‌లలో వివిధ రకమైన క్యాన్సర్‌లు ఉంటాయి.(క్యామాసెల్ క్యాన్సర్, అడెనోకార్సినోమా, పెద్ద కణ క్యాన్సర్).

ఊపిరిపై క్యాన్సర్ కాటు