
ఉరుకుందలో 8న వరలక్ష్మీ వ్రతం
కౌతాళం: ఉరుకుంద ఈరన్న (నరసింహ) స్వామి క్షేత్రంలో ఆగస్టు 8న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఉదయం 9 గంటలకు చేపడుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ మేడేపల్లి విజయరాజు తెలిపారు. దేవస్థాన తూర్పు రాజగోపురం ఎదుట లక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రూ. వె య్యి చెల్లించి వ్రతంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వ్రతంలో పాల్గొనే ప్రతి మహిళకు దేవస్థానం పూజా సామగ్రి ఇస్తుందని చెప్పారు. శేషవస్త్రం, ఒక రవిక, గాజులు, పసుపు–కుంకుమ, తమలపాకులతో కూడిన కిట్‌ను దేవస్థానం తరఫున ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఆగస్టు 1న సుదర్శన హోమం, ఆగస్టు 18న సోమవారం స్వామివారి పల్లకీ ఉత్సవ సేవ, ఆగస్టు 19న రుద్ర హోమం ఉంటుందని తెలిపారు.
సిల్వర్‌జూబ్లీ కళాశాలలో అత్యుత్తమ బోధన
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని సిల్వర్‌జూబ్లీ డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమైంది. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాస్ కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదివిన ప్రతి ఒక్కరూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. కాలేజీలో అత్యుత్తమ విద్యార్హతలు కలిగిన అధ్యాపకులతో బోధన సాగుతోందన్నారు. విద్యార్థులకు క్రమ శిక్షణతో పాటు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సిల్వర్‌సెట్‌లో రెండో ర్యాంకు సాధించిన విద్యార్థి జాహ్నవికి రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్ చేతుల మీదుగా సీటు కేటాయింపు పత్రాన్ని అందజేశారు. మొదటి రోజు 120 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారన్నారు. ఒక్కో సీటుకు ముగ్గురు చొప్పున కౌన్సెలింగ్‌కు పిలిచామని సిల్వర్ సెట్ కన్వీనర్ డాక్టర్ వాయిజ్ తెలిపారు. గురువారం బీఏస్సీ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ జి.ప్రసాద్ రెడ్డి, అధ్యాపకులు ఎల్లా కృష్ణ, ఫామీదా బేగం, ఓబులేసు, రాజశేఖర్, నాగన్న, నరేంద్ర బాబు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీమఠంలో నంద్యాల జిల్లా కలెక్టర్
మంత్రాలయం రూరల్: శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనార్థం బుధవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మంత్రాలయానికి వచ్చారు. జిల్లా కలెక్టర్‌కు శ్రీమఠం అధికారులు స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రాఘవేంద్రుల మూలబృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు జిల్లా కలెక్టర్‌కు ఫలపూలమంత్రాక్షింతలతో ఆశీర్వచనం చేశారు.
ఈ–నామ్‌లో
సమూల మార్పులు
కర్నూలు(అగ్రికల్చర్): ఈ–నామ్‌లో సమూలమైన మార్పులకు కేంద్రం చర్యలు చేపట్టింది. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో క్రయవిక్రయాలన్నీ ప్రస్తుతం ఈ–నామ్‌లోనే జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 15 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్‌ల్లో దాదాపు అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు చేపడుతున్నారు. పత్తికొండ మార్కెట్‌లో టమాట, నంద్యాలలో మిర్చి క్రయవిక్రయాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఈ–నామ్ సేవలను 2.0 వర్షన్‌తో అమలు చేయడానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు నారాయణయూర్తి తెలిపారు. కొత్త వర్షన్‌తో ఈ–నామ్ ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నుంచి అమలవుతుందన్నారు. ఈ–నామ్ కొత్త వర్షన్‌తో వేర్ హౌసింగ్ గోదాముల్లో కూడా వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుపుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు కర్నూలులో 2.0 వర్షన్‌పై శిక్షణా కార్యక్రమం పూర్తి అయిందని, గురువారం ఆదోనిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఉరుకుందలో 8న వరలక్ష్మీ వ్రతం