
ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ మోసం
కర్నూలు: ‘ ఇది ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.. మీకు రూ.50 వేలు రాయితీ’ అంటూ ఆకర్షించి సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయవద్దని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాల ఓటీపీలు చెబితే మోసపోతారని హెచ్చరించారు. పీఎం కిసాన్, ముద్ర లోన్స్, సూర్య ఘర్, అమ్మఒడి తదితర పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ఆయా పథకాలకు దరఖాస్తులు చేసుకునే వారిని ఎంచుకుని బురిడీ కొట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆయా పథకాల పేరుతో మొబైల్‌కు వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు చెబితే కూడా మోసపోయే అవకాశముందని హెచ్చరించారు.
సూచనలు ఇవీ...
● ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల కోసం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించాలి.
● వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు.
● అపరిచిత కాల్స్ వస్తే 1930 నెంబర్‌కు కాల్ చేయాలి.
● అలాగే www.cybercrime.gov.inల లో ఫిర్యాదు చేయాలి.
● ప్రభుత్వ పథకాల సమాచారం కోసం www.gov.in,nic.in లాంటి అధికారిక డొమైన్లను మాత్రమే ఉపయోగించాలి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎస్పీ విక్రాంత్ పాటిల్