
రానున్న ఐదు రోజులు ఎండ, గాలులే!
కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఐదు రోజులు జిల్లాలో ఎండలతో పాటు గాలుల తీవ్రతతో పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాలో ఆగస్టు నెల 3వ తేదీ వరకు వర్షపాత సూచనలు లేవని అనంతపురం వ్యవసాయ వాతావరణ విభాగం అధికారులు ప్రకటించారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35–36 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. గంటకు 12–13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. జూలై మాసంలో చాలా వరకు అంతంతమాత్రం తేలికపాటి వర్షాలు పడటంతో పంటల పరిస్థితి నిరాశజనకంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే ఐదు రోజుల్లో వర్షాల సూచన లేనందున ఆగస్టు నెలలో ఎర్ర నేలల్లో ప్రత్యామ్నాయ పంటలు కంది, జొన్న, కొర్ర, సజ్జ అలసంద, ఉలువ, ఆముదం, పెసర, అనుములు వంటి పంటలు వేసుకోవచ్చని అధికారులు సూచించారు.
నేరాల నియంత్రణకు
గస్తీలు పెంచండి
కర్నూలు: నేరాల నియంత్రణకు గస్తీని పటిష్టం చేసి రాత్రివేళల్లో తనిఖీలు విస్తృతం చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లాడ్జిలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని నిర్వాహకులకు సూచించారు. లాడ్జిల్లో సమాచారం సక్రమంగా చెప్పని వారి వివరాలు ఆరా తీసి చిరునామాలు సేకరించారు. లాడ్జిలలో రాత్రి బస చేసే వ్యక్తుల గుర్తింపు కార్డులను తీసుకుని రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని లాడ్జి యజమానులకు పోలీసులు సూచించారు.
జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు
విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా మంగళవారం జిల్లా అంతటా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రజల భద్రత, రక్షణలో భాగంగా జనం రద్దీగా ఉండే ప్రదేశాలు, రహదారులపై సంచరిస్తూ, పెట్రోలింగ్ చేస్తూ గస్తీ చేపట్టారు. రోడ్డు సేఫ్టీ నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు.
కొత్తూరులో విజిలెన్స్ ఎస్పీ పూజలు
పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణేశ్వర్యస్వామి ఆలయంలో ఉమ్మడి జిల్లా విజిలెన్స్ ఎస్పీ చాముండేశ్వరి పూజలు చేశారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజ లు, అభిషేకాలు, అర్చనలు చేశారు. అలాగే ఆల యచరిత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతం ఆలయ మర్యాదలతో ఆమెకు శేషావస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

రానున్న ఐదు రోజులు ఎండ, గాలులే!