చిలకలపూడి(మచిలీపట్నం): ముసాయిదా ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు ఉంటే నిర్దేశిత గడువులోగా తెలియజేయాలని కృష్ణా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. సర్ 2026లో భాగంగా శుక్రవారం సాయంత్రం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన చాంబర్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, క్లయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ తదితర అంశాలను ఆయన వివరించారు. అనంతరం నవీన్ మాట్లాడుతూ జూన్ 15 నుంచి జూలై 24వ తేదీ వరకు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం బూత్‌లెవల్ అధికారులు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి తిరిగి సేకరించారన్నారు. ఈ ప్రక్రియలో బీఎల్వోలు, బీఎల్‌ఏలు, ఈఆర్వోలతో దశలవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రతి అంశాన్ని పర్యవేక్షించామన్నారు.
వారి పేర్లు పొందుపరచలేదు
అందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందాయని అయితే వారిలో మరణించిన వారు, వలస వెళ్లిన వారు, డూప్లికేట్ నమోదు, చిరునామా తెలియని వారు, ఇతర కారణాలతో వాటిని సమర్పించని వారు ఉన్నారన్నారు. వారి పేర్లు పొందుపరచలేదని ఈ జాబితాను రాజకీయ పార్టీలకు అందజేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రం, ఈఆర్వో కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం జాబితాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో ముసాయిదా జాబితా అందుబాటులో ఉంటుందన్నారు. క్లయిమ్‌లు, అభ్యంతరాల నోటీసులపై వచ్చిన వివరణలు, విచారణలను సెప్టెంబరు 28వ తేదీలోగా పూర్తి చేసి అక్టోబరు 3వ తేదీ తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు షేక్ సలార్‌దాదా, కొడాలి శర్మ, బీఎంవీ దాస్, బి విజయకుమార్, కె.చంద్రశేఖర్, కూనపరెడ్డి శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం డెప్యూటీ తహసీల్దార్ వై.నారాయణ తదితరులు ఉన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో
ఇన్‌చార్జ్ కలెక్టర్ నవీన్


