పొలం ఎండి.. | - | Sakshi
Sakshi News home page

పొలం ఎండి..

Jul 31 2026 1:45 AM | Updated on Jul 31 2026 1:45 AM

కంచికర్ల మండలంలో పెసర, మినుము పైర్లను ట్రాక్టర్లతో దున్నుతున్న రైతులు పంటకాలం పూర్తికావస్తున్నా నీటి తడులు అందక ఎండుముఖం పట్టిన పైర్లు కోడూరు మండలంలో సాగునీరు లేక ప్రశ్నార్థకంగా మారిన ఖరీఫ్‌ వరి సాగు నాట్లు వేయాల్సిన వేళ పశువుల మేతగా మారిన వరి పొలాలు

కంచికచర్ల/కోడూరు: సాగు కాలం పూర్తికావస్తున్నా నీటి తడి అందక ఎండుముఖం పట్టిన అపరాల పైర్లను చూసి రైతులకు గుండె మండింది. ట్రాక్టర్లతో పంటను గురువారం దున్నించారు. కంచికర్ల మండలంలో ఈ ఘటన జరిగింది. నందిగామ నియోజకవర్గంలో ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో 17,900 ఎకరాల్లో వరి, 6,552 ఎకరాల్లో పెసర, 2,218 ఎకరాల్లో మినుము సాగవుతాయి. ఈ ఖరీఫ్‌లో సుమారు 300 ఎకరాల్లో వరి, 3,920 ఎకరాల్లో పెసర, 3,590 ఎకరాల్లో మినుము సాగయ్యాయి. మినుము, పెసర పంటకాలం రెండు నెలలు. ఇప్పటికే అపరాల సాగు చేపట్టి 45 రోజులు గడిచాయి. వర్షాలు కురవకపోవడంతో పైర్లు అన్నీ ఎండుముఖం పట్టాయి. పొలం ఎండి గుండె మండిన రైతులు కంచికచర్ల మండలంలోని మోగులూరు, ఎస్‌.అమరవరం, కంచికచర్ల, పరిటాల గనిఆత్కూరు తదితర గ్రామాల్లో పంటలను ట్రాక్టర్‌తో దున్నుతున్నారు. చెరువులు సైతం అడుగంటడంతో వాటి కింద సాగు చేపట్టిన వరికి సైతం నీటి తడులు అందక పైర్లు ఎండు ముఖం పట్టాయి.

పశువుల మేతగా..

ఒకవైపు నారుమళ్లు ఎండకుండా ఆయిల్‌ ఇంజిన్లతో నీరు తోడుతున్న రైతులు.. మరోవైపు నీటి కోసం ఎదురుచూస్తూ ఖాళీ ఉన్న పొలాలు.. కోడూరు మండలంలో కనిపిస్తున్న ఈ దృశ్యాలు ఖరీఫ్‌ సీజన్‌ దుస్థితికి అద్దం పడుతున్నాయి. ఏటా జూలై చివరి నాటికి కోడూరు మండలంలోని పొలాలు పచ్చని నారుమళ్లు, వరి నాట్లతో కళకళలాడుతాయి. ఈ సారి సాగు నీరు లేక బీడువారిన పొలాల్లో పశువులు, గొర్రెలు, మేకలు మేతకు వెళ్తున్నాయి.

సాగు చేపట్టింది 20 శాతం రైతులే..

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా మండలంలో వరి సాగు ముందుకు కదలడం లేదు. సాగునీరు అందక రైతులు నారుమడి కూడా వేయలేని దుస్థితి నెలకొంది. మండలంలో దాదాపు 80 శాతం మంది రైతులు ఇంకా సాగు ప్రారంభించలేదు. 20 శాతం మంది రైతులు నారుమడులు పోయగలిగారు. నీరు ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు ఆశగా కాలువల వైపు చూస్తూ రోజులు గడుపుతున్నారు. ఎగువ ప్రాంతాల్లోని వి.కొత్తపాలెం, మాచవరం, జయపురం, లింగారెడ్డిపాలెం, కోడూరు గ్రామాలకు చెందిన కొద్దిమంది రైతులు కాలువల్లో వస్తున్న అరకొర నీటి ఆధారంగా నారుమడులు పోశారు. వర్షాలు కురవక, కాలువల్లో నీరు లేక నారుమడులు ఎండిపో కుండా ఉండేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాలువల్లో మిగిలిన కొద్దిపాటి నీటిని ఆయిల్‌ ఇంజన్ల సహాయంతో పొలాలకు ట్యూపుల ద్వారా తోడుకుని నారుమడిని రక్షించుకుంటున్నారు. ఖర్చులు పెరిగిన పంటను కాపాడుకొనేందుకు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు.

దిగువ కాలువకు చుక్క నీరు చేరలేదు

దిగువ ప్రాంతాలైన రామకృష్ణాపురం, ఇరాలి, ఊటగుండం, ఉల్లిపాలెం, హంసలదీవి, మందపాకల, పోటుమీద, పిట్టల్లంక, సాలెంపాలెం, విశ్వనాథపల్లి, వేణుగోపాలపురం గ్రామాలకు సంబంధించిన పంట కాలువల్లో ఇప్పటి వరకు చుక్క నీరు కూడా చేరలేదు. దీంతో ఆ గ్రామాల రైతులు నారుమడులు వేయలేక పూర్తిగా నిరాశలో మునిగిపోయారు. నీరు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో కొందరు రైతులు ఈ ఏడాది సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఒకవేళ నీరు విడుదల చేయడం సాధ్యం కాకపోతే పంట సాగు చేయలేక నష్టపోయే రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement