మచిలీపట్నంటౌన్: రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకునేలా.. ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలని కోరుతూ భారత రత్న, రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్ర పటానికి వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో ఆ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక రామానాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బయటకు రావాలంటేనే భయం..
పార్టీ మహిళా విభాగం నాయకులు మాట్లాడుతూ మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నేడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ నెలకొన్నాయన్నారు. మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నప్పటికీ, వాటిని నిరోధించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. ఇక పోలీస్ యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా మారిపోవడం దురదృష్టకరమన్నా రు. ఇటీవల గుంటూరు, బద్వేలు తదితర ప్రాంతా ల్లో మహిళలను వివస్త్రలను చేసి అవమానించిన అమానవీయ ఘటనలు రాష్ట్రంలో దారుణంగా మారిన పరిస్థితికి అద్దం పడుతున్నాయన్నారు.
అధికార పార్టీ అండదండలతో..
కొన్ని ఘటనల్లో నిందితులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేసుల నమోదులో జాప్యం, విచారణలో నిర్లక్ష్యం, నిందితులపై చర్యలు తీసుకోవడంలో ఉదాసీనత ప్రదర్శిస్తే బాధితులకు న్యాయం జరగడంలేదన్నారు. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకాన్ని ప్రజల్లో నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకే మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థలు, మహిళా పోలీస్ స్టేషన్లు, హెల్ప్‌లైన్లు, పెట్రోలింగ్ బృందాలు సమర్థంగా పని చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
నిరసనకు సంఘీభావం..
ఆ పార్టీ మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల సమన్వయకర్తలు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), ఉప్పాల రాము పాల్గొని ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, బందరు మాజీ మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ ఎం. హరీష, జిల్లా ఉపాధ్యక్షురాలు అన్నవరపు ఎలిజబెత్‌రాణి, జిల్లా కార్యదర్శి కె. పద్మ, కృతివెన్ను జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి, మచిలీపట్నం నియోజకవర్గ అధ్యక్షురాలు వాణిశ్రీ, నగర అధ్యక్షురాలు షేక్ షాహినా, జిల్లా నాయకులు రమాదేవి, కంచర్లపల్లి మాధవి, కై లా సబాకీర్తి, సీహెచ్ రత్నాబాయి, పల్లికొండ రత్నకుమారి, కె. రాణి, పైడిపాముల వరలక్ష్మితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


