మచిలీపట్నం అర్బన్: కృష్ణా జిల్లా నూతన వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి. లోకనాథ్ దయాకర్‌ను ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొకినాల సౌమ్యరేఖ పలువురు స్టాఫ్ నర్సులతో కలిసి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ వైద్య, ఆరోగ్య సిబ్బంది సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, 100 శాతం గ్రాస్ వేతనం అమలు, ఈఎస్ఐ వంటి సంక్షేమ సౌకర్యాల కల్పన, కనీస వేతనాల పెంపు, బదిలీల్లో పారదర్శకత, రిక్వెస్ట్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించాలని కోరారు. అలాగే పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సిబ్బంది కొరత, పని ఒత్తిడి తదితర సమస్యలను డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలపై చర్యలు తీసుకుంటానని, మిగిలిన అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని డీఎంహెచ్‌వో హామీ ఇచ్చారు.
‘తల్లికి వందనం’ లబ్ధిదారుల జాబితా ప్రదర్శన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘తల్లికి వందనం‘ పథకానికి సంబంధించి అర్హుల, అనర్హుల జాబితా, పరిశీలనలో ఉన్న లబ్ధిదారుల జాబితాలు జూలై 22 నుంచి జిల్లాలోని ప్రతి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం ప్రదర్శించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ పేరు జాబితాలో లేకపోవడం, వ్యక్తిగత వివరాల్లో పొరపాట్లు ఉండటం, అనర్హుల జాబితాలో పేరు ఉండటం లేదా ఇతర అభ్యంతరాలు ఏవైనా ఉన్నట్లయితే, సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించి ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చన్నారు. ఫిర్యా దులను జూలై 22 మధ్యాహ్నం నుంచి స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు తమ అభ్యంతరాలు, సమస్యలను నిర్ణీత గడువులోగా నమోదు చేసుకోవాలన్నారు. ప్రతి ఫిర్యాదును ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాల ప్రకారం పూర్తిస్థాయిలో పరిశీలించి, అవసరమైన సవరణలు చేసి అర్హులైన వారికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం అర్హులైన తల్లులు 1,59,812 మంది, పిల్లలు 2,44,614 మంది ఉన్నట్లు వివరించారు.
డయేరియా, కోవిడ్‌పై
అప్రమత్తంగా ఉండాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): వర్షాకాలం ప్రారంభం కావడంతో డయేరియాపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఏ శ్రావణ్‌బాబు అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసి, జాగ్రత్తలు పాటించేలా చూడాలని ఆయన సూచించారు. ఆయన మంగళవారం నగరంలో గతంలో డయేరియా సోకిన ప్రాంతాల్లోని న్యూ రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, గిరిపురం యూపీహెచ్‌సీలను సందర్శించారు. అక్కడ సిబ్బంది హాజరును పరిశీలించి, పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా అనుమానిత కేసులు, ముఖ్యమైన పరిణామాలు ఉంటే వెంటనే తమ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలన్నారు. రోజువారీ రోగులకు అందించే సేవలను యూపీహెచ్‌సీల్లో ఆన్లైన్ చేయాలని ఆదేశించారు.
ఉద్యోగుల సమస్యల
పరిష్కారానికి సమష్టి కృషి
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమష్టి గా కృషి చేస్తామని, మంత్రుల బృందం సమక్షంలో జరిగే స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగుల గళాన్ని బలంగా వినిపిస్తామని ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ తెలిపారు. అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న ఆయన్ని మంగళవారం విజయవాడ లోని ఎన్జీవో హోమ్‌లో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు డి. సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి పి. రమేష్ పాల్గొన్నారు.


