విజయవాడ జీజీహెచ్ శానిటేషన్ కార్మికుల నిరసన
లబ్బీపేట(విజయవాడతూర్పు): రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ ప్రభుత్వాస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం నిరసనకు దిగారు. అందులో భాగంగా కార్మికులు విధులు బహిష్కరించి ఆస్పత్రి గేటు వద్ద ఆందోళన చేశారు. వారికి సీఐటీయూ, సీపీఎం నేతలు అండగా నిలిచారు. అనంతరం వారు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్‌ను కలిశారు. ఈ నెల 25 లోపు తమకు రావాల్సిన పెండింగ్ జీతాలు చెల్లించాలని, లేకుంటే 27 పని బంద్ చేసి, జీతాలు చెల్లించే వరకూ విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మికులకు జీతాలు నెలల పాటు పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ప్రతినెలా చేసిన పనికి జీతం వేయాలని అడిగించుకోవడం ఎంత వరకూ సమంజసం అని ప్రశ్నించారు. ఇక్కడ పనిచేసే కార్మికులంతా అద్దె ఇళ్లలో ఉంటూ, జీతం వస్తే కానీ పూటగడవని దుస్థితిలో ఉన్నట్లు తెలిపారు. ప్రతినెలా 10వ తేదీ జీతం ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చి తిరిగి మూడు నెలలు కావస్తున్నా పెండింగ్ జీతాలు ఇవ్వక పోవడం సమంజసమేనా అని ప్రశ్నించారు. గత సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్య చెప్పామని, కానీ ఇప్పటి వరకూ కార్మికుల సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ నెల 25 లోపు జీతాలు చెల్లించాలని, లేకుండా 27 నుంచి పని బంద్ చేసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.


