గ్రామాలపై సైబర్‌ వల! | - | Sakshi
Sakshi News home page

గ్రామాలపై సైబర్‌ వల!

Jul 22 2026 2:17 AM | Updated on Jul 22 2026 2:17 AM

ప్రభుత్వ పథకాల పేరుతో మాయాజాలం ● సోషల్‌ మీడియా అస్త్రంగా ఉచ్చు ● అకౌంట్ల నుంచి చాకచక్యంగా డబ్బులను దోచేస్తున్న వైనం ● పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఫలితం శూన్యం ● ఇటీవల ఇద్దరి నుంచి రూ.44వేలు నొక్కేసిన సైబర్‌ నేరగాళ్లు ● రెడ్డిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించిన పార్ట్‌టైమ్‌ ఉద్యోగ ప్రకటనను చూసి లింక్‌ను ఓపెన్‌ చేశాడు. అంతే ఇక సైబర్‌నేరగాళ్లు రంగంలోకి దిగి సదరు వ్యక్తిని టెలిగ్రామ్‌ గ్రూప్‌లో జాయిన్‌ చేసి వివిధ టాస్కులను అప్పగించారు. టాస్కులు పూర్తి చేసినందుకు స్వల్ప మొత్తంలో నగదు చెల్లించి నమ్మబలికారు. ఆ తర్వాత ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి పేమెంట్‌ ఆధారిత టాస్కులు ఇచ్చి పలుమార్లు రూ.42వేల నగదు బదిలీ చేయించుకున్నారు. దీనితో మోసపోయానని గమనించిన సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ● జి.కొండూరు మండల పరిధి కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన గ్రామ సచివాలయ ఉద్యోగికి సైబర్‌ నేరగాళ్లు కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో వల విసిరారు. ఈ పథకం కింద ఉచిత వైఫై రూటర్‌ ఇస్తామని నమ్మించి వెబ్‌ లింక్‌ను ఆ వ్యక్తి ఫోన్‌కి పంపారు. లింక్‌ ద్వారా వివరాలను నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని చెప్పారు. బాధితుడు రూ.2,063 చెల్లించిన తర్వాత సైబర్‌నేరగాళ్లు స్పందించకపోవడంతో తన లాగా మరెవరూ మోసపోకూడదని పోలీసులను ఆశ్రయించాడు. ● మైలవరానికి చెందిన ఒక వ్యక్తి నుంచి సైబర్‌ నేరగాడు రూ.10లక్షలు కాజేసిన ఘటనలో బాధితుడి పిర్యాదు మేరకు మైలవరం పోలీసులు నిందితుడిని ఈ ఏడాది జూన్‌ 16వ తేదీన అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ నేరం చేసింది ఎన్టీఆర్‌ జిల్లా, నందిగామ మండల పరిధి కమ్మవారిపాలెంకు చెందిన కిలారు సీతయ్యగా పోలీసులు గుర్తించారు. ఈ నేరగాడు 2018, 2019, 2020 సంవత్సరాల్లో యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్‌ ఎంపికై నప్పటికీ తుది ఎంపికలో విఫలమవడంతో బెటింగ్‌లకు అలవాటుపడి సైబర్‌ నేరాలు చేస్తున్నట్లు గుర్తించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

ప్రభుత్వ పథకాల పేరుతో మాయాజాలం

జి.కొండూరు: ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు ఉచితం, ఫోన్‌ డేటా రీచార్జ్‌ ఉచితం, ఇన్సూరెన్స్‌లు ఉచితం అనగానే ఎగబడి వెబ్‌ లింక్‌లను నొక్కేస్తున్నారు. అంతే సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌లలోకి చొరబడి డేటా చోరీ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలలో ఉన్న నగదును మాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ తరహా దందా గ్రామీణ ప్రాంతాల్లోకి చొరబడింది. గ్రామీణ యువతను టార్గెట్‌ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో సైబర్‌ మోసాలకు పాల్పడడం కలవరానికి గురి చేస్తోంది. అందుబాటులోని ఆధునిక టెక్నాలజీని సరైన పద్ధతిలో వినియోగించకపోతే మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుందనడానికి సైబర్‌ మోసాలే నిదర్శనమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఒకేరోజు రెండు కేసులు..

మైలవరం పోలీసు డివిజన్‌ పరిధిలోని జి.కొండూరు, రెడ్డిగూడెం మండలాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకొని స్వల్ప మొత్తంలో నగదును కోల్పోయి మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. గతంలో జి.కొండూరు మండల పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన ముగ్గురు సంక్షేమ పథకాల పేరుతో సైబర్‌ నేరగాళ్లు విసిరిన వలలో చిక్కుకొని నష్టపోయారు.

సైబర్‌ నేరాలపై నిత్యం అవగాహన కల్పిస్తున్నాం. ఉచితం అని ప్రకటనలు రాగానే ఆశపడి మోసపోతున్నారు. వాట్సాప్‌, పేస్‌బుక్‌, ఇన్‌స్టా, సాధారణ మెసేజ్‌ల ద్వారా వచ్చే వెబ్‌ లింక్‌లను అస్సలు టచ్‌ చేయవద్దు. ప్రభుత్వ పథకాల పేరుతో రిజిస్ట్రేషన్‌ ఫీజు, ప్రోసెసింగ్‌ ఫీజు చెల్లించాలి అంటే స్పందించవద్దు. ప్రభుత్వ పథకాల వివరాలను అధికారిక వెబ్‌సైట్లు, సంబంధిత కార్యాలయాల ద్వారానే తెలుసుకోవాలి. తెలియని వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు, యూపీఐలకు డబ్బులు పంపవద్దు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్‌ చేయడం లేదా సమీపంలోని పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలి.

– సతీష్‌కుమార్‌, ఎస్‌ఐ, జి.కొండూరు

సైబర్‌ నేరగాళ్లు తల్లికి వందనం పథకం అమలును ఆసరాగా చేసుకొని గతేడాది భారీగా మోసాలకు పాల్పడ్డారు. గతేడాది ప్రభుత్వం తల్లికి వందనం నగదు జమ చేసిన జూన్‌ 12వ తేదీని సైబర్‌ నేరగాళ్లు నేరం చేసేందుకు అనువుగా ఎంచుకున్నారు. అనుకున్న ప్రకారం ముందుగా జి.కొండూరు మండల పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన గతంలో గ్రామ వలంటీర్లుగా పని చేసిన వారికి ఫోన్‌ చేసి మిమ్మల్ని మరలా గ్రామ వలంటీర్లుగా తీసుకుంటున్నామని, ఎక్కువ జీతం కూడా వస్తుంది అని నమ్మ బలికారు. వారి దగ్గర గతంలో అమ్మ ఒడి పొందిన లబ్ధిదారుల పేర్లు, ఫోన్‌ నంబర్లు ఇవ్వాలంటూ అడిగారు. దీనితో సదరు మాజీ గ్రామ వలంటీర్లు వారి దగ్గర ఉన్న పేర్లు, ఫోన్‌ నంబర్లను ఇచ్చారు. వారిలో తల్లికి వందనం పెండింగ్‌లో ఉన్న వారిని మోసానికి అనువుగా ఎంచుకున్నారు. వారితో ఫోన్లో మాట్లాడి.. పెండింగ్‌లో నగదు మీ ఖాతాలలో జమ కావాలంటే కొంత అమౌంట్‌ మీరు ఫలానా ఖాతాలో జమ చేయాలని చెప్పి ముగ్గురు నుంచి రూ.44వేలు కాజేసి ఉడాయించారు. ముగ్గురు బాధితులు మోసపోయామని తెలుసుకొని పోలీసులను సంప్రదించారు. ఇప్పుడు తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం విడుదల చేయనున్న నేపథ్యంలో తల్లులు అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement