చిట్టినగర్(విజయవాడపశ్చిమ): వినియోగదారుడికి నాణ్యమైన, పోషకాలు కలిగిన ఉత్పత్తులను అందించడమే విజయ డెయిరీ లక్ష్యమని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ నూతనంగా ఉత్పత్తి చేస్తున్న ఫ్లేవర్డ్ మిల్క్, సబ్జా లస్సీ, మీగడ పెరుగును పాలప్రాజెక్టు ఫంక్షన్ హాల్‌లో గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండీ కొల్లి ఈశ్వరబాబుతో పాటు బోర్డు డైరెక్టర్లు హాజరయ్యారు. తొలుత ప్లాస్టిక్ బాటిల్‌లో వినియోగదారుడికి అందిస్తున్న ఆరు రకాల ఫ్లేవర్డ్ మిల్క్‌ను చైర్మన్, బోర్డు డైరెక్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ.. వినియోగదారుడి అభిరుచికి తగినట్లుగా విజయ డెయిరీ మార్కెట్‌లోకి బాదాం, చాక్లెట్, కాఫీ, స్ట్రాబెరీ, పిస్తా, రోజ్ ఫ్లేవర్లలో పాలతో పాటు వేసవిలో చల్లదనం కోసం సబ్జా ఉన్న లస్సీని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టామన్నారు. వినియోగదారుల నుంచి అధికంగా డిమాండ్ ఉన్న గోల్డ్ పాలతో తయారు చేసిన గోల్డ్ పెరుగు కప్పులను (మీగడ పెరుగు)లను అందిస్తున్నామన్నారు. ఆరు దశాబ్దాల నమ్మకమే విజయ డెయిరీ అని, భవిష్యత్తులో వినియోగదారుడికి అవసరమైన అన్ని రకాల స్వీట్లు, ఐస్ క్రీమ్‌లను అందిస్తామన్నారు. తొలుత గణపతి శ్లోకంతో సాగిన నృత్య ప్రదర్శన అతిథులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, ఫీడ్ కమిటీ సభ్యులు, కేటరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సమితి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


