లబ్బీపేట(విజయవాడతూర్పు): కటక్‌లో ఈ నెల 11, 12 తేదీల్లో జరగనున్న నేషనల్ ఇండోర్ రోయింగ్ పోటీలకు రాష్ట్ర జట్టు తరలివెళ్లినట్టు ఆంధ్రప్రదేశ్ స్కల్లింగ్ అండ్ రోయింగ్ అసో సియేషన్ అధ్యక్షుడు, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ డాక్టర్ తరుణ్ కాకాని శుక్రవారం తెలిపారు. మార్చి 17 నుంచి 26 వరకు వివిధ జిల్లా స్థాయిల్లో నిర్వహించిన ఎంపికల్లో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశా మని పేర్కొన్నారు. అండర్–15 విభాగంలో గువ్వాడి పార్థు, బోర వైషాంత్, బండం రాకేష్, అండర్–17 విభాగంలో గొల్లపెల్లి శ్రీకర్, గువ్వాడి హిమజ, అండర్–19 విభాగంలో చీపుల్ల రుపాశ్రీ, ఓపెన్ విభాగంలో ఉదార్ల విజయ్, వాసిరెడ్డి గిరి రాజశేఖర్, శ్వామ్ గణేష్ ఎంపికయ్యారని వివరించారు.
రెడ్డిగూడెం: మండలంలోని కుదప గ్రామానికి చెందిన బొర్రా సావిత్రి (74) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. రెడ్డిగూడెం ఎస్‌ఐ ఎస్.శ్రీను కథనం మేరకు.. సావిత్రి తన కుమారుడి తిరుపతయ్య వద్దే ఉంటోంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కుటుంబ కలహాలు తలెత్తాయి. ఈ నెల ఎనిమిదో తేదీన ఇంటిలో ఎవరు లేని సమయంలో బొర్రా సావిత్రి, ఆమె కుమారుడు తిరుపతయ్య అప్పులబాధ, కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగు తాగారు. కొంతసేపటి తరువాత వారిని గుర్తించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ నెల తొమ్మిదో తేదీ ఉదయం పరిస్థితి విషమించి సావిత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రస్తుతం తిరుపతయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి మనవడు బొర్రా ప్రభాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గన్నవరం: రానున్న ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువుల కొరత లేకుండా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కృష్ణా జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.పద్మావతి సూచించారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల విక్రయ డీలర్లు, పీఏసీఎస్ సీఈఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ ఒకే రైతుకు ఎక్కువ బస్తాల యూరియా ఇచ్చే ధోరణిలో కాకుండా, రైతుల వాస్తవ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలన్నారు. ఎరువుల విక్రయాలకు సంబంధించి బిల్లులు, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఎరువులు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు బిల్లు ఇవ్వాలని స్పష్టంచేశారు. ఎరువుల విక్రయాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఈ–పాస్ మిషన్‌లో ఆన్‌లైన్ చేయాలని తెలిపారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి రైతులకు యూరియా విక్రయాలకు సంబంధించిన వివరాలను మండల వ్యవసాయ అధికారులకు అందజేయాలని చెప్పారు. ఏపీ మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ఎం.మురళీకృష్ణ, వ్యవసాయ శాఖ ఏడీఏ ఎం. సునీల్, గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
గన్నవరం: స్థానిక సొసైటీపేటలోని శ్రీగాయత్రి అమ్మవారి దేవస్థానానికి జెడ్పీ మాజీ చైర్మన్ కడియాల రాఘవరావు కుమారుడు కడియాల రవి, సత్యవాణి దంపతులు లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆలయ కమిటీ అధ్యక్షులు కేవీఆర్. కిషోర్‌కు విరాళానికి సంబంధించి ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను సత్యవాణి అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆలయ శాశ్వత నిధి కోసం విరా ళంగా లక్ష రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన రవి దంపతులకు కృతజ్ఞతలు తెలి పారు. ఎఫ్‌డీపై ప్రతి ఏడాది వచ్చే వడ్డీ నగదును ఆలయ నిర్వహణ నిమిత్తం వినియోగించనున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ కార్యదర్శి ఎస్. రవికుమార్, కోశాధికారి ఎస్. గోపాలకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె. బాల రాజేశ్వరరావు, రాజా, కె.కృష్ణదీక్షితులు, సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


