ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం
పంటకొనేవారు లేరు
● పంటమార్పిడి చేసినందుకు కష్టాలు
● పంట కొనుగోలుపై స్పందించని ప్రభుత్వం
● గిట్టుబాటు ధర లభించక రైతులు సతమతం
పెనమలూరు: కృష్ణా ఆయకట్టు రైతులు రెండో పంటగా దాళ్వా వరి సాగు చేపట్టొద్దని, ఇతర పంటలు సాగుచేస్తే అండగా ఉండి ప్రోత్సహిస్తామని, రైతులను ఎల్లవేళలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేసింది. ప్రభుత్వ మాటలు నమ్మి రబీలో వరి బదులు తెల్లజొన్న సాగుచేసిన రైతులు నిలువునా మునిగారు. తెల్లజొన్న పంటను కొనేవారు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రభుత్వం, అధికారులు మాటలు నమ్మి..
పెనమలూరు మండలంలో రబీలో మినుము, పెసర సాగుకు అనుకూలమైన పరిస్థితులు లేవు. ఈ పంటలకు పల్లాకు తెగులు ఎక్కువగా సోకడంతో రైతులు రెండో పంటగా దాళ్వా వరి సాగు చేస్తున్నారు. గత ఏడాది దాళ్వా సాగులో దిగుబడులు అధికంగా వచ్చాయి. అయితే ధాన్యానికి గిట్టుబాటు ధర లభించలేదు. ప్రభుత్వం సకాలంలో పంట కొనుగోలు చేయకపోవటంతో దళారులు ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేశారు. దీంతో రైతులు రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంట మార్పిడి చేయాలని రైతులకు సలహా ఇచ్చింది. వరి బదులు ఇతర పంటల సాగు చేస్తే అండగా ఉంటామని ప్రకటించింది. పైగా అధికారులు ప్రతి గ్రామంలో పర్యటించి పంట మార్పిడి చేయాలని రైతులు ప్రోత్సహించారు. మండల పరిధిలో రైతులు దాదాపు 1400 ఎకరాల్లో ఈ ఏడాది రెండో పంటగా తెల్లజొన్న సాగు చేశారు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.23 వేల వరకు ఖర్చు చేశారు. జనవరిలో పంట సాగు ప్రారంభమవగా ఇప్పుడు పంట దిగుబడికి సిద్ధంగా ఉంది. పంట కోసి విక్రయించాలంటే కనీస ధర కూడా పలకటం లేదు.
మార్క్‌ఫెడ్‌తో కొనుగోలు చేయాలి
తెల్లజొన్న పంటను ప్రభుత్వం ముందుకు వచ్చి మార్క్‌ఫెడ్ నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. దళారులకు బస్తా రూ.500 చొప్పున నష్టానికి విక్రయిస్తే తమకు మిగిలేది ఏమీ లేదని పేర్కొంటున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా తెల్లజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. లేని పక్షంలో పూర్తిగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెల్లజొన్న సాగు వివరాలతో ప్రభుత్వానికి పూర్తి నివేదిక పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే మార్క్‌ఫెడ్ ద్వారా పంట కొనుగోలు చేస్తాం. ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నాం.
– మురళీకిషోర్, డీఎం, మార్క్‌ఫెడ్
రైతులు నానా తిప్పలుపడి తెల్లజొన్న పంట సాగు చేయగా పంట కొనే వారు లేక పోవటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తెల్లజొన్న క్వింటా బస్తా గరిష్ట ధర రూ.2500 వరకూ ఉండేది. ప్రస్తుతం రూ.1600 మాత్రమే ధర పలుకుతోంది. యుద్ధం కారణంగా పరిశ్రమలకు గడ్డుకాలం రావటం, ఎగుమతులు లేక పోవటం, ప్రభుత్వం వద్ద స్పష్టమైన పంటల సాగు విధానం లేక పోవటం తమ పాలిట శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇతర పంటలకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లే తెల్లజొన్న కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయటంలేదని ప్రశ్నిస్తున్నారు. పంట మార్పిడి పేరుతో రైతులను ఒత్తిడి చేసి తెల్లజొన్న సాగు చేయాలని సూచించిన అధికారులు సైతం పంట కొనుగోలు విషయంలో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు.


