సాక్షి టాస్కు ఫోర్సు: తోటి కులస్తులమైన తమకే న్యాయం చేయలేని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా మిగిలిన వారికి ఏం చేస్తారని బాధిత దళిత యువతి సుప్రియ తండ్రి జుఝవరపు చిన్ని ప్రశ్నించారు. మండలంలోని పసుమర్రు గ్రామంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మాదిగ కులానికి న్యాయం చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తమకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. తన కుమార్తెను అన్యాయంగా అరెస్టు చేసి జైల్‌లో పెడితే కనీసం పరామర్శించలేక పోయారని పేర్కొన్నారు. ఆయన పార్టీ నాయకులు తమను దళితులమని చూడకుండా లేనిపోని అపవాదులతో ఇబ్బందులు పెడుతున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు. గ్రామంలో ప్రెస్ మీట్‌లు తమను దొంగలుగా ముద్రించి, అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాయకుడు కైలే అనిల్‌కుమార్‌కు, ఎమ్మెల్యేకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. మట్టి మాఫియాలో కోట్లకు కోట్లు కొల్లగొట్టిన వారు ఎక్కడ? నీతి, నిజాయితీతో దళితులను ఆదుకునే అనిల్‌కుమార్ ఎక్కడని ప్రశ్నించారు. తనను, తన కుటుంబ సభ్యులను దొంగలని నిరూపిస్తే వెంటనే తన కంఠం కోసేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రియ తల్లి ఆరోగ్యం మాట్లాడుతూ.. గ్రామ మాజీ సర్పంచ్ ప్రతి విషయంలో తమను చులకనగా చూస్తూ, తమపై లేనిపోని అభాండాలను వేసి అన్యాయానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన చేస్తున్న అవమానానికి తామందరం చనిపోదామని అనుకున్నామని వాపోయారు. బాధిత యువతి జుఝవరపు సుప్రియ మాట్లాడుతూ.. మీడియా ముందుకు తమ కుటుంబాన్ని తీసుకొచ్చి, తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఒక దళితుడైన మాజీ సర్పంచ్ గ్రామంలోని దళిత యువతికి జరిగిన అన్యాయంపై మాట్లాడకుండా, వారి నాయకుల గొప్పల గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా తమపై అభాండాలు వేయటం దారుణమన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తూ ఉంటామని స్పష్టంచేశారు.
దళిత యువతి సుప్రియ
తండ్రి జుఝవరపు చిన్ని


