కెరమెరి: ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మెరుగుపర్చేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇప్పటికే అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే నీట్, ఎప్‌సెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ అందించేందుకు శిక్షణ సంస్థలతోనూ ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు ‘విద్యాకిట్’లు అందిస్తోంది. పాఠశాల స్థాయి మా దిరిగా నోటుపుస్తకాలు, బ్యాగులు, షూలు పంపిణీ చేస్తోంది. సర్కారు కళాశాలల విద్యార్థులకు ఇలా మూడు రకాల వస్తువులు అందించడం ఇదే తొలి సారి. జిల్లాలోని పేద, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గనుంది.
బ్యాగులు, షూలు, నోటుపుస్తకాలు
జిల్లాలో మొత్తం 11 ప్రభుత్వ కళాశాలలు ఉండగా, 4,612 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం వీరందరికీ షూలు, బ్యాగులు పంపిణీ చేస్తోంది. అలాగే ఒక్కొక్కరికి 12 చొప్పున నోట్‌బుక్స్‌లు అందిస్తోంది. పుస్తకాలు, నోటుబుక్స్ భద్రపర్చుకునేందుకు బ్యాగులు ఎంతో ఉపయోకరంగా మారనున్నాయి. ప్రభుత్వ కళాశాలలపై వి ద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మరింత నమ్మకం ఏర్పడుతుందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు మరింత పెరుగుతా యని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు ఉపయోగకరం
ప్రభుత్వ ఇప్పటికే ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించింది. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న నోట్‌బుక్స్, బ్యాగులు, షూలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. పంద్రాగస్టు కానుకగా అందించడం సంతోషకరం. ఇక చదువులపై దృష్టి సారిస్తాం.
– గాయక్‌వాడ్ మనీష, బైపీసీ సెకండియర్, కెరమెరి
బాసటగా ఉంటుంది
రాష్ట్ర ప్రభుత్వం కిట్లు అందించడం ఇంటర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు బాసటగా ఉంటుంది. పిల్లలకు ఇబ్బందులు లేకుండా తల్లిదండ్రులపై ఆర్థికభారం తప్పుతుంది. గతం కంటే ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. స్టూడెంట్లు రెగ్యులర్‌గా కాలేజీకి హాజరుకావాలి.
– రాథోడ్ రాందాస్, డీఐఈవో


