పార్టీలకు ‘టికెట్’ టెన్షన్!
ఒక్కో వార్డు నుంచి ఇద్దరు, ముగ్గురు ఆశావహులు అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలకు తప్పని ఇబ్బందులు నామినేషన్లకు ఒకరోజే గడువు
కాగజ్‌నగర్‌టౌన్: ప్రధాన పార్టీలకు టికెట్ తలనొప్పులు మొదలయ్యాయి. ఒక్కో వార్డు నుంచి ఇద్దరు, ముగ్గురు ఆశావహులు ఉండటంతో ఎవరికి బీఫామ్ ఇవ్వాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆశావహులు ప్రధాన పార్టీల నాయకుల చుట్టూ ప్రదర్శన చేస్తున్నారు. కొన్నివార్డుల్లో అభ్యర్థులను ఖరారు చేసినా చివరి నిమిషం వరకు ప్రకటించేందుకు అధిష్టానాలు సాహసం చేయడంలేదు. ఎదుటి పార్టీల అభ్యర్థి బలాబలాలను అంచనా వేస్తున్నారు. కానీ గడువు తక్కువగా ఉండటంతో ఇప్పటికే కొందరు బీంఫామ్ లేకుండా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
పోటీలో ప్రధాన పార్టీలు
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20, కాగజ్‌నగర్‌లో 30 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కాగజ్‌నగర్ పట్టణంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌తోపాటు బీఎస్పీ, జనసేన, ఎంఐఎం పార్టీలు ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌లు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒక్కో వార్డు నుంచి రెండువర్గాల నాయకులు పోటీకి సై అంటున్నారు. వారిలో అభ్యర్థిని ఎంపిక చేయడం వీరికి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ దండె విఠల్ నాయకులతో కలిసి జాబితా ఖరారు చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నారు. విజయావకాశాలు ఉన్న అభ్యర్థులను బరిలో నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఆర్థికంగా ఉన్నవారికే..
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఎన్నికల్లో ఆర్థికంగా ఉన్నవారిని ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఉత్సాహంగా ఉన్నవారికి ఖర్చులపై ముందుగానే స్పష్టత ఇస్తున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఒక్కో వార్డు నుంచి పోటీచేసే వారు కనీసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నట్లు సమాచారం. అయితే స్థానికంగా పట్టు ఉన్నవారిని బరిలోకి దింపి.. సత్తా చాటాలని పార్టీలు భావిస్తున్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు.
బీఫామ్ ఎవరికో..?
కాగజ్‌నగర్ మున్సిపల్ ఎన్నికలు ఆయా పా ర్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మున్సిపల్‌లోని 30 వార్డుల్లో ఒక్కో వార్డు నుంచి బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. ఆయా పార్టీల నాయకులు బీఫామ్ ఎవరికివ్వాలో అంతర్మథనంలో ఉన్నారు. ఆశావహులను సున్నితంగా తిరస్కరించకపోతే రెబల్‌గా పోటీచేసే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి బీఫామ్ దక్కకుంటే బీఎస్పీ, జనసేన, ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందువల్ల మందుగానే నామినేషన్లు వేస్తున్నారు. బీఫారాలు ఇవ్వడానికి ఉపసంహరణ వరకు గడువు వరకు ఉండటం వారికి కలిసి వస్తోంది.


