నేడే పుర పోరు
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లో 50 వార్డులు బరిలో 224 మంది అభ్యర్థులు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ షురూ ఈ నెల 13న ఫలితాలు వెల్లడి
జిల్లాలో పురపోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. గెలుపు మాదే అని ధీమాతో ఆయా పార్టీలు ఉండగా, ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. మున్సిపల్ కౌన్సిలర్‌గా బరిలో నిలిచిన అభ్యర్థుల భవిష్యత్తు ఈ నెల 13న తేలనుంది.
ఆసిఫాబాద్: జిల్లాలోని ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20, కాగజ్‌నగర్‌లో 30 వార్డులు ఉన్నాయి. 65,132 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. రెండు మున్సిపాలిటీల పరిధిలోని 50 వార్డుల్లో 113 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 224 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆసిఫాబాద్‌లో 9 ప్రాంతాల్లో 28 పోలింగ్ స్టేషన్లు, కాగజ్‌నగర్‌లో 28 ప్రాంతాల్లో 85 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 113 మంది పోలింగ్ అధికారులతోపాటు 20 శాతం అదనపు పీవోలతో 136 మందికి విధులు కేటాయించారు. ఆసిఫాబాద్‌లో 34 మంది, కాగజ్‌నగర్‌లో 102 మంది ఉన్నారు. అలాగే 339 మంది ఏపీవోలు, 20 శాతం అదనపు ఏపీవోలతో 407 మందిని నియమించారు. 25 మంది రిటర్నింగ్ అధికారులు, 25 మంది ఏఆర్వోలను నియమించగా, ఒక్కో విభాగంలో ఏడుగురిని రిజర్వ్‌లో ఉంచారు. 13 మంది జోనల్ అధికారులు, ఇద్దరు ఎఫ్‌ఎస్‌టీ, నలుగురు ఎస్‌ఎస్‌టీలు విధులు నిర్వర్తిస్తున్నారు.
ఉదయం ఏడు గంటలకు షురూ
మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటరు కార్డుతో ఓటు వేయవచ్చు. ఆ కార్డు లేకుంటే పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సు, పాన్‌కార్డు, బ్యాంకు/పోస్టాఫీస్ పాస్‌బుక్, పట్టాదార్ పాస్‌బుక్, ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, పెన్షప్‌పత్రం(ఫొటోతో), ఉద్యోగ ఐడీకార్డు(పబ్లిక్ సెక్టార్)లో ఏదైనా ఒకటి తీసుకెళ్లాలి. ఎన్నికల్లో అధిక సీట్లు మహిళలకు కేటాయించగా, చాలావరకు కొత్తవారు బరిలో నిలిచారు. సోమవారం సాయంత్రంతో ప్రచారం పరిసమాప్తం కాగా.. అభ్యర్థులు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. కలెక్టర్ కె.హరిత పర్యవేక్షణలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది.
కేంద్రాలకు తరలిన సిబ్బంది
మున్సిపల్ ఎన్నికల సిబ్బంది మంగళవారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలురు గురుకుల వసతిగృహం, కాగజ్‌నగర్‌లోని పాత బాలవిద్యామందిర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని రిటర్నింగ్ అధికారులు సిబ్బందికి పంపిణీ చేశారు. మధ్యాహ్నం భోజనం అనంతరం సిబ్బంది సామగ్రితో పోలీసు భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు, సిబ్బందికి వసతుల కల్పన, కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహణ, పోలీసుల బందోబస్తు తదితర ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ప్రతీ రెండు గంటలకు పోలింగ్ శాతాన్ని ఆర్వోలకు అందించనున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత సామగ్రి, సిబ్బందిని పంపిణీ కేంద్రాలకు సురక్షితంగా చేర్చేందుకు ప్రణాళిక రూపొందించారు.
మున్సిపాలిటీల వివరాలు
మున్సిపాలిటీ వార్డులు అభ్యర్థులు ఓటర్లు పోలింగ్ కేంద్రాలు
ఆసిఫాబాద్ 20 94 13,927 28
కాగజ్‌నగర్ 30 130 51,205 85
నేడే పుర పోరు
నేడే పుర పోరు


