సిర్పూర్(టి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. సిర్పూర్(టి) మండలం మేడిపల్లి పంచాయతీలో గురువారం నిర్వహించిన గ్రామ సభకు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు గ్రామాల అభివృద్ధికి సహకరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధిహామీ పనులు, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు నరసింహ, ఈఈ ధర్మేంద్ర, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మహిళల రక్షణ కు ‘సఖి’ సేవలు
ఆసిఫాబాద్: మహిళల రక్షణకు సఖి కేంద్రం సేవలందిస్తుందని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో గల సఖి కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించి, సమస్యలు తక్షణం పరిష్కరించే దిశగా సఖి కేంద్రం పని చేస్తుందని తెలిపారు. బాధితులకు కౌన్సిలింగ్, న్యాయ సహాయం, వైద్యసేవలు, ఆశ్రయం కల్పన వంటి సేవలు అందిస్తున్నామన్నారు. కేంద్రంలో రికార్డులు పరిశీలించి, కేసుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులు తెలుసుకున్నారు.


