జన్కాపూర్‌లో ఉద్రిక్తత
ఆసిఫాబాద్: జన్కాపూర్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద బుధవారం కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కేంద్రంలోకి గంటకోసారి ఏజెంట్లను పార్టీల వారీగా పంపడానికి పోలీ సులు నిర్ణయం తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ వారికి ఎక్కువగా అనుమతిస్తున్నారని, తమ ను అనుమతి ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జాబరి రవీందర్ ఆరోపించారు. ఆయనతోపాటు బీజేపీ నేతలు డ్యూటీలో ఉన్న తిర్యాణి ఎస్సై వెంకటేశ్‌ను ప్రశ్నించారు. ఎస్సై వారిని వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తుండగానే.. డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, కాంగ్రెస్ శ్రేణులు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత పోలీసులు అన్ని పార్టీ ల నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి పంపించడంతో గొడవ సద్దుమణిగింది.
మీడియాపై ఆంక్షలు
జిల్లా కేంద్రంలో పలుచోట్ల పోలీసులు మీడియాపై ఆంక్షలు విధించారు. ఉర్దూ పాఠశాలలోకి వెళ్లేందుకు మీడియా ప్రతినిధులను గస్తీ కానిస్టేబుల్ నిరాకరించడంతో.. అక్కడే ఉన్న లింగాపూర్ ఎస్సై గంగన్న సర్దిచెప్పారు. జన్కాపూర్ పోలింగ్ కేంద్రం గేటు వరకే మీడియాకు అనుమతి ఉందని తెలిపారు. ఆర్డీవో లోకేశ్వర్‌రావు దృష్టికి సమస్య వెళ్లింది. ఆర్డీవో ఫోన్‌లో జోనల్ అధికారిని ఆదేశించడంతో మీడియా ప్రతినిధులను అనుమతించారు. స్థానిక సీఐ బాలాజీ వరప్రసాద్, ఇతర సీఐలు బందోబస్తును పర్యవేక్షించారు.


