ఆహ్లాదమేది.. ఆటలేవి?
కౌటాల మండలం వీర్ధండి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలోని 15 చెట్లను ఈ నెల 1న అదే గ్రామానికి చెందిన వ్యక్తి నరికేశాడు. గ్రామానికి దూరంగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో రక్షణ లేకుండా పోయింది. ఐదేళ్లుగా పెంచిన చెట్లను నరికి వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని పంచాయతీ సిబ్బంది పేర్కొంటున్నారు. అధికారుల పట్టింపులేని కారణంగా వనంలోని చెట్లను నరకడంతో పాటు పశువులను వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కౌటాల: ప్రకృతి అందాలతో పల్లెలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు గత రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. గ్రామీణ వాసులకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదం అందించాలనే లక్ష్యంతో ఖాళీ స్థలాలను గుర్తించి వీటిని ఏర్పాటు చేశారు. కాగా అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఆహ్లాదం పంచాల్సిన పార్కులు గ్రామాలకు దూరంగా ఉండడంతో రక్షణ లేకుండా పోతోంది. వీటితో పాటు గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో పల్లెకో క్రీడా మైదానం ఏర్పాటు చేశారు. కానీ క్రీడా మైదానాల్లో చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి.
పార్కులకు రక్షణేది..!
జిల్లాలోని చాలా వరకు పల్లె ప్రకృతి వనాలు గ్రా మాలకు దూరంగా ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఉపయోగపడటం లేదు. అధికారులు సైతం వీటి వైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలున్నాయి. ఫలితంగా కొన్ని ప్రకృతి వనాల్లోని మొక్కలు ఎండిపోగా, మరికొన్ని చోట్ల విపరీతంగా గడ్డి పెరగడంతో అగ్ని ప్రమాదాల్లో చెట్లు కాలిపోతున్నాయి. జిల్లాలో మొత్తం 335 గ్రామ పంచాయతీల పరిధిలో 1100 వరకు పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి. వీటికి రక్షణ లేకపోవడంతో వనాల్లోని చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. వేసవి కాలం సమీపిస్తుండడంతో వనాల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో పల్లె ప్రకృతి వనాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పల్లె ప్రకృతి వనాల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఆటల్లేవ్..
గ్రామీణ యువతకు అందుబాటులో మైదానాలు ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు నిర్ణయించింది. కానీ అధికారుల ఆర్భాటంతో అనేక చోట్ల ఆయా గ్రామాలకు కిలోమీటరు, రెండు కిలోమీటర్ల దూరంలో మైదానాలు ఏర్పాటు చేశారు. దీంతో అటు వైపు ఎవరూ వెళ్లకపోవడంతో నిరుపయోగంగా ఉంటున్నాయి. ప్రభుత్వం క్రీడా పరికరాలు అందించినా ఆడేందుకు అనువైన స్థలాలు లేకపోవడంతో అవి మూలకే పడేయాల్సిన పరిస్థితి ఉందని యువకులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 878 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ఎకరం విస్తీర్ణంలో ఉండే వీటిలో ఫుట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ ఆటలు ఆడాలని ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ఆదిలో అధికారులు హడావుడి చేయడంతో దాదాపు అన్నిచోట్ల సరైన స్థలం లేకపోవడంతో పాఠశాలల మైదానాల్లోనే ఏర్పాటు చేశారు. మరికొన్ని గ్రామాల్లో సరిగా చదును చేయకపోవడంతో రాళ్లు, రప్పలతో ఆడలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రకృతి వనాలపై దృష్టి
గ్రామీణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం పార్కులను ఏర్పాటు చేసింది. పార్కుల్లో చెత్తాచెదారం ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిస్తాం. వనాల్లోని చెట్లను నరికి వేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. క్రీడా మైదానాల్లో వసతులు కల్పిస్తాం. వేసవి దృష్టా పంచాయతీ సిబ్బంది వనాల్లో చెత్త లేకుండా చూడాలి.
– భిక్షపతి, జిల్లా పంచాయతీ అధికారి
కౌటాల మండలంలోని కనికి గ్రామ శివారులో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. కేవలం క్రీడా ప్రాంగణం అనే బోర్డు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. ఈ ప్రాంగణంలో ఆటలు ఆడేందుకు క్రీడా సామగ్రి కూడా ఏర్పాటు చేయలేదు. సమాధులు ఉన్న ప్రదేశంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడంతో అటు వైపు క్రీడాకారులు కన్నెత్తి చూడడం లేదు. దీంతో మైదానం నిరుపయోగంగా మారింది.
ఆహ్లాదమేది.. ఆటలేవి?
ఆహ్లాదమేది.. ఆటలేవి?


