జమలాపురంలో భక్తుల అన్నదానానికి రూ.లక్ష విరాళం | - | Sakshi
Sakshi News home page

జమలాపురంలో భక్తుల అన్నదానానికి రూ.లక్ష విరాళం

Sep 13 2026 12:48 AM | Updated on Sep 13 2026 12:48 AM

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదంతో పాటు స్వామి మూలవిరాట్‌కు అర్చకులు పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం, పల్లకీ సేవ జరిపించారు. ఈ సందర్భంగా ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం కొత్త మంగాపురం గ్రామానికి చెందిన వేమిరెడ్డి రామకోటారెడ్డి – లావణ్య దంపతులు ఆలయంలో అన్నదానానికి రూ.1,00,011 విరాళం అందజేశారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

‘భారత్‌ పశుధన్‌’ పోర్టల్‌లో రైతుల వివరాలు

నేలకొండపల్లి: జిల్లాలో పశువులు కలిగిన ప్రతీ రైతు వివరాలను భారత్‌ పశుధన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ పురంధర్‌ సూచించారు. మండలంలోని చెన్నారంలో శనివారం పశువైద్య శిబిరం నిర్వహించి పశువులకు పరీక్షలు చేశాక వ్యాక్సిన్లు వేశారు. ఈ శిబిరాన్ని పరిశీలించిన పురంధర్‌ మాట్లాడుతూ పోర్టల్‌లో రైతుల వివరాలు నమోదు చేసేందుకు వచ్చే సిబ్బందికి ఆధార్‌ నంబర్‌, ఇతర వివరాలు అందించాలని సూచించారు. ఇంకా జిల్లాలో 15వేల మంది మిగిలి ఉన్నందున ముందుకు రావాలని తెలిపారు. కాగా, సాస్కిలో భాగంగా చేపట్టిన కృత్రిమ గర్భధారణ లక్ష్యాన్ని ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే, లంపిస్కిన్‌ వ్యాధి కట్టడికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈఓ డాక్టర్‌ కె.కిషోర్‌, పశు వైద్యాధికారులు శ్రీనివాసరావు, భువనేష్‌, ఉద్యోగులు, నాయకులు వెంకటేశ్వరరావు, చింతనిప్పు సైదులు, నాగరాజు, తాజ్‌పాషా, నరేష్‌, పాండురంగయ్య తదితరులు పాల్గొన్నారు.

కమనీయం..

రామయ్య కల్యాణం

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శనివారం రామయ్య నిత్యకల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఉన్న శ్రీరామా సేవా మండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

స్వామివారి సన్నిధిలో అరకు ఎంపీ

శ్రీ సీతారామ చంద్రస్వామివారిని శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ఎంపీ గుమ్మ తనుజా రాణి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి దర్శించుకున్నారు. ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement