ప్రస్తుత ప్రభుత్వం తీరుతో ఎండుతున్న పంటలు
ధర్నాలో మాజీ ఎమ్మెల్యే
సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లి/వేంసూరు: పదేళ్ల బీఆర్‌ఎస్ పరిపాలనలో సీఎంగా కేసీఆర్ రైతాంగానికి కోతలు లేకుండా 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు గంటలు కూడా ఇవ్వలేకపోతోందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలకు నీరందక ఎండిపోతున్నాయని తెలిపారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ వేంసూరు మండలం కందుకూరు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద శనివారం భరణిపాడు, దుద్దేపూడి, కందుకూరు, లచ్చన్నగూడెం, వెంకటాపురం రైతులతో కలిసి బీఆర్‌ఎస్ ఆధ్వర్యాన ధర్నా చేశారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని కథనాలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు త్రీ ఫేజ్ కరెంట్ ఎన్ని గంటల పాటు ఇస్తున్నారో లాగ్ బుక్ చూపించాలని కోరితే అధికారులు నిరాకరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నెలలోనే విద్యుత్ సమస్యలను తీర్చి ప్రజలకు వెలుగులు పంచారని చెప్పారు. ఖర్చుకు వెనకాడకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు అందించిన ఘనత తమ పార్టీదేనని తెలిపారు. ఇప్పుడు ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని పేర్కొన్నారు. అంతేకాక వరిలో ఎంపిక చేసిన సన్న రకా లకు బోనస్ ఇస్తామని చెప్పడం, యూరియా యాప్ తో ఇబ్బందులు తీర్చకపోవడం, బీమా అమలులో జాప్యం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని సండ్ర ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు మందపాటి వెంకటరెడ్డి, గొర్ల ప్రభాకర్‌రెడ్డి, యర్రా రమేష్, పాల వెంకటరెడ్డి, పగుట్ల వెంకటేశ్వరరావు, మోరంపూడి శ్రీధర్, దొడ్డా వెంకటకృష్ణారెడ్డి, మందపాటి మహేశ్వర్‌రెడ్డి, రాయల సత్యనారాయణ, నాగరాజు, బాబు తదితరులు పాల్గొన్నారు.


