సత్వర న్యాయమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సత్వర న్యాయమే లక్ష్యం

Sep 13 2026 12:48 AM | Updated on Sep 13 2026 12:48 AM

● లోక్‌ అదాలత్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు ● జిల్లాలో 11,168 కేసుల పరిష్కారం

● లోక్‌ అదాలత్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు ● జిల్లాలో 11,168 కేసుల పరిష్కారం

ఖమ్మం లీగల్‌: కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్‌ అదాలత్‌ లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు తెలిపారు. ఖమ్మంలోని జిల్లా కోర్టుతో పాటు సత్తుపల్లి, మధిర కోర్టుల్లో శనివారం లోక్‌ అదాలత్‌ నిర్వహించగా, ఖమ్మం న్యాయ సేవాసదన్‌లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దేవీమానస అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా జడ్జి మాట్లాడారు. పురాతన కాలంలో రచ్చబండ వంటి వేదికల ద్వారా న్యాయం చెప్పేవారని, ప్రస్తుత లోక్‌ అదాలత్‌కు అదే మూలాధారమని అన్నారు. పెండింగ్‌ కేసులు, సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల ఇరుపక్షాలు గెలవడమే కాక ప్రశాంత వాతావరణం నెలకొంటుందని తెలిపారు. అనంతరం న్యాయమూర్తులు వి.సీనయ్య, మహేష్‌నాధ్‌, కృష్ణార్జున్‌, బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు మందడపు శ్రీనివాసరావు, పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యడ్లపల్లి రమేష్‌ మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ ద్వారా శాశ్వత, అంతిమ పరిష్కారం లభిస్తుందని, కేసుల నుంచి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఆతర్వాత లోక్‌ అదాలత్‌ ద్వారా రాజీ పడిన మూడు కేసుల్లో కక్షిదారులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఓ కేసులో రోడ్డు ప్రమాద బాధిత మహిళకు రూ.88 లక్షల బీమా చెక్కు అందించారు. న్యాయమూర్తులు కల్పన, శివరంజని, మురళీమోహన్‌, జ్యోతిర్మయి, రజని, బిందుప్రియ, ప్రవీణ్‌, నాగలక్ష్మి, బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కొప్పుల రవికుమార్‌, ఉపాధ్యక్షుడు జానీమియాతో పాటు పోలీసు, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

11,168 కేసులు పరిష్కారం

లోక్‌ అదాలత్‌ నిర్వహణకు ఖమ్మంలో జిల్లా కోర్టులో పలు బెంచ్‌లు ఏర్పాటుచేశారు. అలాగే, మధిర, సత్తుపల్లి కోర్టుల్లోనూ లోక్‌ అదాలత్‌ నిర్వహించగా మొత్తంగా 11,168 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో సివిల్‌ కేసులు 80, క్రిమినల్‌ కేసులు 1,246 పరిష్కారం కాగా, 75 మోటార్‌ ప్రమాద కేసులను పరిష్కరించడంతో బాధితులకు రూ.5.85 కోట్ల పరిహారం అందింది. ఇక చెక్‌ బౌన్స్‌, ఎస్‌టీసీ, సైబర్‌ క్రైమ్‌ కేసులు, ఫ్రీ లిటిగేషన్‌ కేసులు కూడా పరిష్కరించగా రూ.2,60,63,115 పరిహారం అందజేశారు. ఇందులో సైబర్‌ క్రైమ్‌ బాధితులకు రూ.27,90,612 అందజేసినట్లు పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ తెలిపారు. ఈమేరకుఅత్యధిక పరిష్కారానికి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు న్యాయవాదులు, సహకరించిన కక్షిదారులను ఆయన ఓ ప్రకటనలో అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement