రెండున్నర నెలలు దాటినా ఒక్క జతా అందని వైనం
కొన్ని పాఠశాలల్లో ఇచ్చినా నాణ్యతలేమి
విద్యా సంవత్సరం ప్రారంభమై రెండున్నర నెలలు గడిచినా ఇప్పటికీ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒక్క జత యూనిఫామ్ కూడా అందలేదు. కొన్ని
పాఠశాలలకు యూనిఫామ్ వచ్చినా..
చొక్కా వస్తే ప్యాంట్, ప్యాంట్ వస్తే చొక్కా లేక పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇక ఇచ్చిన పలు పాఠశాలల్లో యూనిఫామ్ క్లాత్ నాణ్యత లేక వేసుకున్న కొద్దిరోజులకే
కుట్లు ఊడి చిరుగులు కనిపిస్తున్నాయి.
– సాక్షి ప్రతినిధి,ఖమ్మం
వైరా మండలంలో ఎనిమిది జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలు, ఆరు ప్రాథమికోన్నత పాఠశాలలు, 32 ప్రాథమిక పాఠశాలలు కలిపి మొత్తం 46 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,900 మంది చదువుతున్నారు. వీరికి యూని ఫామ్ కోసం 19,315 మీటర్ల క్లాత్ అవసరమైతే 9,846.35 మీటర్లే వచ్చింది. వైరా మున్సిపాలిటీ పరిధిలో మెప్మా ఆధ్వర్యాన, వైరా మండలంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో యూనిఫామ్‌లు కుట్టిస్తున్నారు. ఇంకా 50 శాతం క్లాత్ రావాల్సి ఉందని మండల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఉన్న క్లాత్‌తో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థినులకు స్కర్ట్‌లు, 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థినులకు ప్యాంట్లు, బాలురకు చొక్కాలు సిద్ధం చేయించామని వెల్లడించారు.
పంద్రాగస్టు పోయి పది రోజులు
జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలలు మొత్తం 1,179 ఉండగా, 34,988 మంది బాలికలు, 31,120 మంది బాలురు చదువుతున్నారు. వీరికి ఒక జత ఈనెల 15 నాటికి, రెండో జత నెలాఖరుకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా అమలుకాలేదు. విద్యార్థులకు ఒక్కో జత యూనిఫామ్ అందకపోగా, కొన్నిచోట్ల అరకొరగా పంపిణీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియకపోవడం పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.
సరిపడా క్లాత్ ఏదీ?
జిల్లాలో విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్‌కు 3,02,716 మీటర్ల క్లాత్ అవసరం కాగా.. ఇప్పటి వరకు 2,74,928 మీటర్ల క్లాత్ మాత్రమే చేరింది. ప్రధానంగా బాలురకు సంబంధించి నిక్కర్, బాలికల కోటు క్లాత్ రాలేదు. ఐదు రకాల సైజుల్లో యూనిఫామ్‌లు కుడుతున్నారు. పూర్తి స్థాయిలో క్లాత్ రాకపోవడం, వచ్చిన క్లాత్‌తో కూడా డ్రెస్‌లు కుట్టకపోవడంతో రెండు జతలు విద్యార్థులు ఎప్పటికి అందుతాయోనన్న అయోమయం నెలకొంది.
నాణ్యత లేక చిరుగులు
కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు యూనిఫామ్ పంపిణీ చేసినా నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి. స్టిచ్చింగ్, దారం నాణ్యత సరిగ్గా లేకపోవడం, క్లాత్ పలచగా ఉండడంతో కొద్దిరోజులకే కుట్లు ఊడి చిరుగులు తేలుతున్నాయి. క్లాత్ ఎంపిక సమయంలో ప్రభుత్వ యంత్రాంగం నాణ్యతను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో విద్యార్థికి ఇచ్చే రెండు జతల యూనిఫామ్ విద్యాసంవత్సరం ముగిసే వరకు ఉపయోగపడాల్సి ఉన్నా వారం రోజులుగా కుట్లు ఊడిపోతుండడంతో అందరూ సాధారణ దుస్తుల్లోనే తరగతులకు హాజరవుతున్నారు. కాగా, జిల్లా కేంద్రమైన ఖమ్మంలో యూనిఫామ్ పంపిణీ ఇప్పటి వరకు ప్రారంభం కాకపోగా.. చాలా మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది.
ప్రభుత్వ విద్యార్థులకు అందని యూనిఫామ్


