పెద్దాస్పత్రిలో సిద్ధమైన క్రిటికల్ కేర్ బ్లాక్
రూ.23.75 కోట్ల నిధులు.. 50 పడకలతో నిర్మాణం
నేడు ప్రారంభించనున్న మంత్రి తుమ్మల
ఖమ్మం వైద్యవిభాగం: ఉమ్మడి జిల్లా ప్రజారోగ్య చరిత్రలో మరో ముందడుగు పడింది. ప్రాణా పాయ స్థితిలో ఉన్న వారిని హైదరాబాద్‌కు తరలించే అవసరం లేకుండా, ఇక్కడే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా ఖమ్మం జనరల్ ఆస్పత్రిలో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ సిద్ధమైంది. ఈ విభాగాన్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ప్రారంభించనున్నారు. తీవ్రమైన అనారోగ్యం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ నిధులతో ఈ బ్లాక్‌ను నిర్మించారు.
రూ.8.48కోట్లతో పరికరాలు
క్రిటికల్ కేర్ బ్లాక్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.23.75 కోట్లు కేటాయించింది. 2023 జూన్ 7న జారీ కాగా, సుమారు రూ.15.27 కోట్లతో నిర్మాణం పూర్తిచేశారు. మిగతా రూ.8.48 కోట్లను అత్యాధునిక వైద్య పరికరాల కోసం వెచ్చించనున్నారు. తద్వారా భవనం మాత్రమే కాక, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యపరికరాలు అందుబాటులోకి వచ్చి చికిత్సలో నాణ్యత మరింత మెరుగుపడనుందని భావిస్తున్నారు.
నాలుగు అంతస్తుల్లో సమగ్ర వైద్యం
క్రిటికల్ కేర్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ కాక నాలుగు అంతస్తులు ఉన్నాయి. ఇందులో అంతస్తులు, బ్లాక్ వారీగా వివిధ విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి 50 పడకలే ఏర్పాటుచేస్తున్నా... అవసరం మేర పడకలు పెంచుకునేలా భవనాన్ని విశాలంగా నిర్మించారు. రెండు ఐసీయూ విభాగాలు ఏర్పాటు చేయగా 20 చొప్పున 40 పడకల్లో అత్యవసర వైద్యం అందనుంది. అంతేకాక 20 పడకలతో జనరల్ వార్డు, ఐదు పడకలతో డయాలసిస్ వార్డు ఏర్పాటుచేశారు.
హైదరాబాద్‌కు తరలింపు
అవసరం తగ్గే అవకాశం
గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, తీవ్ర శ్వాసకోశ సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం తదితర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రులకు లేదా హైదరాబాద్ తరలించాల్సి వస్తోంది. కానీ పెద్దాస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి రానుండడంతో మెరుగైన వైద్యసేవలు స్థానికంగానే అందనున్నాయి. ఈక్రమంలో విలు వైన సమయం ఆదా అయి ప్రాణాపాయ పరిస్థితి తప్పుతుందని భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులకే కాక సూర్యాపేట, మహబూబాబాద్ తదితర జిల్లాల ప్రజలకు కూడా ఈ బ్లాక్‌తో ప్రయోజనం లభించనుంది.


