ఇంకా లోటు వర్షపాతం
సోమవారం పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం (సెం.మీ.ల్లో)
● జిల్లాలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షం ● సాగు చేసిన పత్తి... మెట్ట పంటలు కళకళ ● అయినా 20మండలాల్లో వర్షాభావమే..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎల్‌నినో పరిస్థితుల్లోనూ బోర్లు, బావులు, వర్షాధారంగా సాగు చేసిన పంటలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు చేవ ఇచ్చినట్లయింది. భారీ వర్షాలు లేకున్నా ఓ మోస్తరుగా పడడంతో పంటలు పచ్చగా కళకళలాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి మొదలైన జల్లులు సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగాయి.
వచ్చే నెలలోనైనా..
ఈ వానాకాలం అన్ని పంటలు కలిపి 5,53,329 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేస్తే 4,34,446 ఎకరాల్లోనే సాగయ్యాయి. ప్రధానంగా నాగార్జునసాగర్ ఆయకట్టుపై ఎల్‌నినో ప్రభావం పడింది. సాగైన అన్ని పంటల్లో వరి 1,65,725 ఎకరాలు, పత్తి 2,35,637 ఎకరాలు, పెసర 30,152 ఎకరాల్లో ఉన్నాయి. ఇంకొన్నిచోట్ల మొక్కజొన్న, మినుము, చెరుకు, కందులు, ఇతర పంటలను సాగు చేశారు. బోర్లు, బావులు కింద తరి పంటలు సాగు చేస్తే, వైరా, సత్తుపల్లి నియోజవకర్గాల్లో గోదావరి జలాలు అండగా నిలిచాయి. మిగతా ప్రాంతాల్లో సాగు చేసిన తరి, మెట్ట పంటలకు వచ్చే నెలలోనైనా కనీసం ఒకటి, రెండు భారీ వర్షాలతో పాటు ఇంకొన్ని సార్లు ఓ మోస్తరు వర్షాలు పడితేనే చేతికి వచ్చి దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. దీంతో రైతులు వచ్చే నెలపైనే గంపెడాశలు పెట్టుకున్నారు.
పత్తి చేతికి వచ్చినట్లే..
జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2,16,229 ఎకరాలు కాగా, 19,408 ఎకరాలు అదనంగా 2,35,637 ఎకరాల్లో సాగైంది. వాతావరణ పరిస్థితులు, సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల కాకపోవడంతో వరి సాగు చేసే రైతులు కూడా పత్తి సాగు వైపు మొగ్గడంతో విస్తీర్ణం పెరిగింది. ఇప్పటికే పంట కాయ దశలో ఉండగా.. వచ్చే నెల పత్తి తీసే దశకు చేరుతుంది. ఆ సమయానికి అడపాదడపా వర్షాలు పడితే పంటకు ఢోకా లేదని భావిస్తున్నారు.
జోరందుకున్న మిర్చి సాగు
రెండు రోజులుగా వాతావరణం చల్లబడడం, వర్షాలు కురుస్తుండడంతో మిర్చి నాటే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఇన్నాళ్లు నారు సిద్ధం అయినా వేచిచూసే ధోరణి అవలంభించారు. ప్రస్తుత వర్షాలతో మిర్చి నారు నాటుతుండగా.. నీటి భవిష్యత్‌లో కొరతను అధిగమించేందుకు మల్చింగ్, డ్రిప్ పద్ధతులు అవలంబిస్తున్నారు. వర్షాలు కొనసాగుతూ, వాతావరణం చల్లగా ఉంటే మిర్చి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
పెసరకు నష్టం
జిల్లాలో పత్తి, వరి తర్వాత అత్యధికంగా పెసర సాగైంది. జూన్, జులై నెలలో సాగు చేసి, కోతకు సిద్ధమవగా, ప్రస్తుత వర్షాలతో పంట తడిచి కాయలు రాలిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. పెసర కాయలు ఎండి కోతకు సిద్దంగా ఉన్న తరుణాన కురిసిన వర్షంతో గింజలు మొలక వచ్చే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వానాకాలం సీజన్‌లో జూన్ నుంచి ఇప్పటి వరకు ఇంకా లోటు వర్షపాతమే ఉంది. మొత్తం 21 మండలాలకు గాను 19 మండలాల్లో 20 నుంచి 59 శాతం వరకు లోటు ఏర్పడింది. కేవలం కల్లూరు మండలంలోనే సాధారణ వర్షపాతం నమోదు కాగా.. ఎర్రుపాలెం మండలంలో తీవ్ర వర్షపాత లోటు నమోదైంది. సాధారణాన్ని మించి ఏ ఒక్క మండలంలోనూ ఈ సీజన్‌లో వర్షం కురవలేదు. ఇప్పటివరకు సగటున ఒక్కో మండలంలో 55.5 సెం.మీ. వర్షం పడాల్సి ఉండగా 36.6 శాతమే కురిసింది.
ప్రాంతం వర్షపాతం
మంచుకొండ 3.1
కల్లూరు 3.1
గుబ్బగుర్తి 3.0
పంగిడి 2.1
కుర్నవల్లి 2.0
పల్లెగూడెం 2.0
వైరా 1.8


