సాగు తగ్గించాలంటూ
అధికారుల అవగాహన
వేచిచూసే ధోరణిలో రైతాంగం
కోకోపిట్ కొరత, సాగుపై సందిగ్ధత
రైతులకు విస్తృత అవగాహన
మధిర: వర్షాభావ పరిస్థితులు వరి సాగుపై కాక మిర్చి సాగుపైనా ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే నారు పెంచే నర్సరీలు తగ్గగా, అధికారులు సైతం మిర్చి సాగు తగ్గించాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే, ఈనెలాఖరు వరకు మిర్చి సాగుకు అవకాశం ఉన్నందున ఆ సమయానికి సాగు విస్తీర్ణంపై స్పష్టత రానుంది.
నర్సరీల రెన్యూవల్ అంతంతే...
వ్యవసాయ సీజన్ ఆరంభం నుంచే అధికారులు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పిస్తుండడంతో మిర్చి నారు పెంచే నర్సరీల యజమానులు ఆచితూచి వ్యవహరించారు. ఏటా జూన్ చివరి నుంచే నర్సరీల్లో నారు పెంపకం మొదలుపెట్టి ఆగస్టు వరకు విక్రయిస్తారు. కొందరు రైతులు సొంతంగా విత్తనాలు తెచ్చుకుంటే, ఇంకొందరికి నర్సరీల యజమానులే తాము పెంచిన నారు విక్రయించడం ఆనవాయితీ. ఈసారి పరిస్థితుల దృష్ట్యా చాలామంది నర్సరీల యజమానులు రెన్యువల్‌కే మొగ్గుచూపలేదు. అంతేకాక నారు పెంపకానికి అవసరమైన కోకోపిట్ ధర టన్నుకు గత ఏడాది రూ.5వేలు ఉంటే ఈ ఏడాది రూ.11వేలకు చేరడంతో వెనుకడుగు వేశారు. జిల్లాలోని కూసుమంచి, రఘునాథపాలెం, కారేపల్లి, తల్లాడ, కామేపల్లి, కొణిజర్ల, మధిర తదితర మండలాల్లో ఎక్కువగా మిర్చి సాగవుతుంది. గత ఏడాది 235 నర్సరీల ద్వారా 53.40 కోట్ల మొక్కలను రైతులకు విక్రయించారు. ఈసారి చాలాచోట్ల నర్సరీల్లో నారు సిద్ధం చేసినా... కొనుగోళ్లు మాత్రం ఊపందుకోలేదు. గత వారంగా కురుస్తున్న వర్షాలతో కొందరు రైతులు నారు తీసుకెళ్లి నాటుతున్నా, విస్తీర్ణంపై మాత్రం అంచనాకు రాలేకపోతున్నారు.
పెరుగుతుందని భావిస్తే...
గత సీజన్ చివరి నుంచి ఇప్పటివరకు బహిరంగ మార్కెట్‌లో మిర్చి రేటు ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం తేజ రకం క్వింటా రూ.22 వేలకు పైగా ధర పలుకుతోంది. దీంతో ఈ ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందని అంచనా వేశారు. కానీ ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పరిస్థితి తారుమారైంది. 2024–2025 సీజన్‌లో జిల్లాలో 70 వేల ఎకరాల్లో మిర్చి సాగు కాగా, ఆ ఏడాది సరైన ధర లేక 2025–2026 సీజన్‌లో 30 వేల ఎకరాలకే సాగు పరిమితమైంది. ఈసారి ధర బాగున్నప్పటికీ ఎల్‌నినో ప్రభావం.. అధికారులు అవగాహన కల్పిస్తుండడంతో సాగు విస్తీర్ణం పెద్దగా పెరగకపోవచ్చని తెలుస్తోంది.
వర్షాభావంతో మిర్చి సాగుపై నీలినీడలు
కోకో పిట్ కొరత తీవ్రంగా ఉంది. అంతేకాక గత ఏడాది టన్ను ధర రూ.5వేలు ఉంటే ఈ ఏడాది రూ.11వేలకు చేరింది. వర్షాభావ పరిస్థితులతో మిర్చి సాగు ఎలా ఉంటుందో తెలియడం లేదు. అంతుకే రైతులు విత్తనాలు తీసుకొస్తేనే నారు పెంచుతున్నాం.
– కిషోర్, నర్సరీ యజమాని, మధిర
ఏడు నెలల కాలపరిమితి కలిగిన మిర్చి సాగుకు ప్రతీ దశలో నీరు అవసరం ఉంటుంది. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా మిర్చి సాగు తగ్గించాలని రైతులకు సూచిస్తున్నాం. ఈనెలాఖరు వరకు మిర్చి సాగు చేసే అవకాశమున్నందున ఇప్పుడే అంచనా వేయలేం. – మధుసూదన్,
జిల్లా ఉద్యాన శాఖ అధికారి, ఖమ్మం


