కరువు వేళ.. ‘ఉపాధి’ ఆసరా | - | Sakshi
Sakshi News home page

కరువు వేళ.. ‘ఉపాధి’ ఆసరా

Aug 9 2026 1:46 AM | Updated on Aug 9 2026 1:46 AM

● ఎల్‌నినో ప్రభావంతో కూలీల తిప్పలు ● చేతినిండా పని కల్పించేలా అధికారుల ప్రణాళిక ● జలసిరి, వనమహోత్సవం ద్వారా సన్నాహాలు

సద్వినియోగం చేసుకోవాలి..

● ఎల్‌నినో ప్రభావంతో కూలీల తిప్పలు ● చేతినిండా పని కల్పించేలా అధికారుల ప్రణాళిక ● జలసిరి, వనమహోత్సవం ద్వారా సన్నాహాలు

ఖమ్మంమయూరిసెంటర్‌: ఆకాశం వైపు చూస్తే మబ్బుల పలకరింపులే తప్ప వర్షాలు కురవడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వానలు ముఖం చాటేయడంతో వ్యవసాయ పనులు లేక కూలీలు అవస్థ పడుతున్నారు. ఈ క్లిష్ట సమయాన ఉపాధి హామీ కూలీలను ఆదుకునేందుకు యంత్రాంగం నడుం బిగించింది. సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతీ కూలీకి పని కల్పించేలా కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

జలసిరి పనులు

వర్షపు నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. అంతేకాక బోరుబావులు రీచార్జ్‌ అయ్యే అవకాశముంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని వీబీజీ రామ్‌ జీ (ఉపాధి హామీ) పథకంలో భాగంగా 100 శాతం సబ్సిడీతో ఇంకుడు గుంతల నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఈ పనులతో రైతులకు లబ్ధి జరగడమే కాక కూలీల చేతి నిండా పని దక్కుతుంది. ఇంకుడు గుంతల నిర్మాణానికి ముందుకు వస్తున్న ప్రజలు, రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం తక్షణమే అనుమతి జారీ చేస్తున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం, వనమహోత్సవ పనులకు సంబంధించి ఇప్పటికే 7,516 దరఖాస్తులకు ఆమోదించి ఉపాధి కూలీలతో పని చేయిస్తున్నారు.

ఉచిత నిర్మాణాలు

గృహాల నుంచి వచ్చే వృథా నీటిని భూమిలోకి మళ్లించేలా ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రభుత్వం రూ.6,500 వరకు సమకూరుస్తోంది. కూలీలతో ఈ పని చేయించి వారికి వేతనంగా చెల్లిస్తారు. అలాగే, సామాజిక గుంతల నిర్మాణానికి రూ.3వేలు వెచ్చిస్తున్నారు. ఇక పంట కుంటల(ఫామ్‌ పాండ్స్‌) నిర్మాణానికి సైతం లక్ష్యాలు విధించి భారీ సబ్సిడీతో మంజూరు చేస్తున్నారు.

పని గ్యారంటీ

వీబీజీ రామ్‌ జీ పథకం నిబంధనల ప్రకారం ప్రతీ కూలీ కుటుంబానికి ఏటా 125 రోజుల పాటు పని కల్పించాలి. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారులు వనమహోత్సవంలో భాగస్వామ్యం చేస్తున్నారు. గ్రామాల్లో గుంత తీయించి మొక్కలు నాటడం, ట్రీగార్డులు ఏర్పాటు చేయడం, నీళ్లు పోసి సంరక్షించే బాధ్యతలను ఉపాధి కూలీలకే అప్పగిస్తుండడంతో పర్యావరణ పరిరక్షణే కాక కూలీలకు దీర్ఘకాలికంగా పని లభిస్తోంది. ఫలితంగా వర్షాభావ పరిస్థితులతో గ్రామీణ ప్రాంతాల నుంచి కూలీలు నగరాలు, పట్టణాలకు వలస వెళ్లకుండా గ్రామాల్లోనూ పని దక్కనుంది. మరోపక్క భూగర్భ జలాలు పెరిగి తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయని ప్రజలు భావిస్తున్నారు.

వర్షాభావ పరిస్థితుల్లో కూలీలు ఇబ్బంది పడకుండా జిల్లావ్యాప్తంగా ఉపాధి పనులను వేగవంతం చేశాం. జలసిరి కింద ఇంకుడు గుంతలు, పంట కుంటల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నాం. అర్హులైన ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – కొండపల్లి శ్రీరామ్‌,

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement