విస్తృత ప్రచారంతో
జూనియర్ కాలేజీల్లో పెరిగిన ప్రవేశాలు
కలిసొచ్చిన పాఠ్య, నోట్ పుస్తకాల
పంపిణీ
అల్పాహారం, భోజనం
అమలు హామీతో చేరికలు
సౌకర్యాల కల్పనతోనే...
ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సౌకర్యాలు కల్పించడమే కాక నాణ్యమైన విద్య అందిస్తూ ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది నోట్‌బుక్కులు కూడా పంపిణీ చేయగా, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలుచేస్తామన్న ప్రకటనతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి కనబరిచారు. జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గత ఏడాది 2,862 మంది విద్యార్థులు చేరితే, ఈ ఏడాది ఇప్పటి వరకు 3,127 మంది ప్రవేశాలు పొందడంతో పలు కాలేజీలు కళకళలాడుతున్నాయి. ప్రవేశాలకు ఈనెల 15వ తేదీ వరకు గడువు ఉన్న నేపథ్యాన ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
విస్తృత ప్రచారం
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపునకు అధ్యాపకులు, ఉద్యోగులు గత విద్యాసంవత్సరం చివరి సమయం నుంచే విస్తృత ప్రచారం చేశారు. కాలేజీల్లోని సౌకర్యాలు, మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థుల వివరాలను కరపత్రాల ద్వారా వివరించా రు. ఉచిత పాఠ్య, నోట్ పుస్తకాల పంపిణీ, డిజిటల్ బోధనతో పాటు ఈ విద్యాసంవత్సరం నుంచి అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలవుతుందని వివరించడంతో ప్రవేశాలు పెరిగాయి.
ప్రవేశాలు ఇలా..
జిల్లాలోని 21కాలేజీలకు గాను అత్యధికంగా ఖమ్మంలోని ఏఎస్‌ఆర్ శాంతినగర్ జూనియర్ కళాశాలలో ప్రవేశాలు నమోదయ్యాయి. ఈ కాలేజీలో గత ఏడా ది 361మంది విద్యార్థులు ఉంటే, ఈ ఏడాది ఇప్పటి వరకు 440మంది చేరారు. సత్తుపల్లి బాలికల కళాశాలలో గత ఏడాది 80మంది ఉండగా.. ఈ ఏడాది 126కు పెరిగింది. ఇలా పలు కళాశాలల్లో గతేడాతో పోలిస్తే 20–40మంది వరకు ఎక్కువగా చేరారు. అయితే, కొన్ని కాలేజీల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రవేశాలు కాలేదు. బనిగండ్లపాడు కళాశాలలో గత ఏడాది 67మంది విద్యార్థులు ఉండగా.. ఈ ఏడాది 47మందే ఉన్నారు. నాగులవంచ కళాశాలలో 104 మంది ఉండగా.. ఈసారి 69మంది, ముదిగొండ కళాశాలలో గత ఏడాది 117మంది ఉంటే ఈ ఏడాది 91 మంది, బోనకల్‌లో గత ఏడాది 96 మంది విద్యార్థులు ఉండగా ఈసారి 70కే పరిమితమైంది.
ప్రభుత్వ కళాశాలల్లో గత ఏడా ది కన్నా ఈ ఏడాది ప్రవేశాలు పెరిగాయి. కాలేజీల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, నాణ్యమైన విద్య అందించడ మే కాక డిజిటల్ బోధన, ఉచిత పాఠ్య, నోట్‌పుస్తకాల పంపిణీ తదితర అంశాలు కలిసొచ్చాయి. ఈ నెల 15వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశం ఉన్నందున విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– రవిబాబు, డీఐఈఓ


