శ్రీవారికి నిత్యకల్యాణం, అభిషేకం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారికి నిత్యకల్యాణం, అభిషేకం

Aug 2 2026 12:58 AM | Updated on Aug 2 2026 12:58 AM

జనరల్‌ మేనేజర్‌ తనిఖీ

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామి, అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ జరిపించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

బచ్చోడు తండాలో

ఒకరికి డెంగీ

తిరుమలాయపాలెం: మండలంలోని బచ్చోడు తండాలో ఓ మహిళ తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా ఇటీవల తిరుమలాయపాలెం సీహెచ్‌పీలో చికిత్స చేయించారు. మళ్లీ శనివారం సుబ్లేడు ఆస్పత్రిలో ర్యాపిడ్‌ టెస్టు చేయిస్తే డెంగీ పాజిటివ్‌గా తేలడంతో పాటు ప్లేట్‌లెట్‌ కౌంట్‌ పడిపోయినట్లు తెలిసింది. దీంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంతేకాక ఇదే గ్రామానికి చెందిన మరో వృద్ధురాలు కూడా జ్వరంతో బాధడుతుండడంతో ఖమ్మం తరలించినట్లు తెలిసింది. గ్రామంలో డెంగీ కేసు నమోదు కావడంతో స్థానికులు ఆందోళన చెందుతుండగా, సుబ్లేడు పీహెచ్‌సీ ఇన్‌చార్జ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ అర్జున్‌ గౌతమ్‌ ఆధ్వర్యాన వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. డెంగీ బారిన పడిన మహిళ ఇంటి చుట్టూ దోమల నివారణకు ఫాగింగ్‌ చేయడమే కాక స్థానికులకు పారిశుద్ధ్య చర్యలపై అవగాహన కల్పించారు. జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రిలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

డోర్నకల్‌ సీఎస్‌ఐ బిషప్‌గా సేనంరాజ్‌

ప్రస్తుతం ఖమ్మం సీఎస్‌ఐ చర్చి చైర్మన్‌

ఖమ్మంగాంధీచౌక్‌: ఖమ్మం సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌ చర్చి చైర్మన్‌ డాక్టర్‌ కోరా సేనంరాజ్‌కు డోర్నకల్‌ డయోసిస్‌ బిషప్‌ పదవి వరించింది. తమిళనాడు రాష్ట్రంలోని సీనాడ్‌లో తాజాగా జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశంలో సేనం రాజ్‌ను డోర్నకల్‌ డయోసిస్‌ బిషప్‌గా నియమించారు. ఆయన ప్రస్తుతం ఖమ్మం సీఎస్‌ఐ ఖమ్మం చర్చి చైర్మన్‌గానే కాక డోర్నకల్‌ డయోసిస్‌ కోశాధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు. పలు చర్చిల అభివృద్ధికి కృషి చేసిన సేనంరాజ్‌ను తెలంగాణ, ఏపీతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని సుమారు 3 వేల చర్చిలకు కేంద్రమైన డోర్నకల్‌ డయోసిస్‌ బిషప్‌ పదవి దక్కడంపై పలువురు మత గరువులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం డోర్నకల్‌ డయాసిస్‌ బిషప్‌గా సేనంరాజ్‌కు అక్కడి సీఎస్‌ఐ చర్చిలో మత పెద్దల సమక్షాన పట్టాభిషేకం జరగనుంది.

దక్షిణ కోస్తా రైల్వే

మధిర/ఎర్రుపాలెం: మధిర, ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లను దక్షిణ కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌మాధూర్‌ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లలో వసతులు, అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కాగా, మధిర స్టేషన్‌లో మరిన్ని రైళ్లకు హాల్టింగ్‌ ఇవ్వడమే కాక కోచ్‌ సూచిక బోర్డుల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం కల్పించాలని బీజేపీ నాయకులు జీఎంను కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బీజేపీ పట్టణ, మండల అధ్యక్షులు శివరాజు సుమంత్‌, గడ్డం శ్రీహరిచౌదరి, నాయకులు ఏలూరి నాగేశ్వరరావు, చిలువేరు సాంబశివరావు పాల్గొన్నారు. ఇక జమలాపురం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎర్రుపాలెంలో శాతవాహనకు హాల్టింగ్‌ కల్పించాలని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులతో పాటు ప్రయాణికులు కోరడంతో జీఎంకు స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. మధిర మార్కెట్‌ చైర్మన్‌ బండారు నర్సింహారావు, కాంగ్రెస్‌, బీజేపీ మండల అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాసరెడ్డి, అనుమోలు సురేశ్‌, ఆయా పార్టీల నాయకులు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నూతక్కి నర్సింహారావు, దేవరకొండ కోటేశ్వరరావు, ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి హన్మంతరావుతో పాటు కొప్పు రవి, షేక్‌ మౌలాలి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement