ముదిగొండ: వాతావరణ పరిస్థితుల నేపథ్యాన రైతులకు కష్టాలు మొదలయ్యాయి. జూన్‌లో తొలకరి వానలకు పత్తి విత్తనాలు నాటగా.. ఆతర్వాత వరుణుడు కరుణ లేక కొందరు రెండు, మూడేసిసార్లు విత్తనాలు నాటారు. అయినా ఇప్పుడు వర్షాల జాడ లేకపోవడంతో పంటను కాపాడుకునేందుకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముదిగొండ మండలంలోని రైతులు అత్యధికంగా వ్యవసాయంపైనే ఆధారపడుతుండగా.. వరి, మొక్కజొన్న, పత్తి ఎక్కువగా పండిస్తారు. అయితే, నాటిన పత్తి గింజలు బతికి మొక్కలు వచ్చినా ప్రస్తుత ఎండలతో వడబడి చనిపోతున్నాయి. మరోపక్క బోర్లు, బావులు, చెరువుల్లోనూ నీరు అడుగంటుతుండడంతో ఆగమ్యగోచరంగా మారింది. మండలంలోని కమలాపురానికి చెందిన పెద్దిబోయిన శ్రీను మూడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి విత్తనాలు నాటగా మొక్కలు బతికించుకునేందుకు బావుల నీటిని విద్యుత్ మోటార్ల ద్వారా రోజూ అందిస్తున్నాడు. రోజుకు పది కాల్వలు మాత్రమే తడుస్తుండగా.. ఏ మాత్రంఆశ వదులుకోకుండా నాలుగు రోజుల నుంచి బావి నీరు పెడుతున్నాడు. అయితే, వాన దేవుడు కరుణిస్తే తప్ప పంట చేతికి వచ్చే అవకాశం లేదని శ్రీను చెబుతున్నాడు.
పత్తి మొక్కలు కాపాడుకునేందుకు
భగీరథ యత్నం


