● పలుచోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వాన ● వర్షం కురిసిన ప్రాంతాల్లో పైర్లకు ప్రాణం
ఖమ్మంవ్యవసాయం: రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఊరిస్తుండగా శనివారం సాయంత్రం తర్వాత వరుణుడు ఎట్టకేలకు నామమాత్రంగా కనికరించాడు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి తేలిక పాటి వర్షం కురిసింది. రాత్రి 9 గంటల సమయానికి కొణిజర్ల మండలం పెద్దగోపతి వద్ద 37 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇక తిరుమలాయపాలెం మండలం బచ్చోడు వద్ద 34.5 మి.మీ., ఖమ్మం ఖానాపురం వద్ద 17.8 మి.మీ., పంగిడిలో 14.5, కలెక్టరేట్ వద్ద 14.3, ముదిగొండలో 11.8, చింతకానిలో 9.8, కల్లూరు, పెనుబల్లిలో 7, వైరాలో 6.5, కాకరవాయిలో 3.8, సత్తుపల్లిలో 3, పమ్మిలో 2.8, మంచుకొండలో 2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉక్కపోతతో సతమతమవుతున్న జనానికి ఈ వాన కొంత మేర ఊరటనిచ్చినట్లయింది.
పంటలకు ప్రాణం
ఎండ తీవ్రతతో వడబడుతున్న పైర్లకు ప్రస్తుతం కురుస్తున్న వర్షపు జల్లులు ప్రాణం పోస్తున్నాయి. ఈనెల ఆరంభం నుంచి వర్షాలు లేక ఎండల ప్రభావంతో పంటలు దెబ్బతింటున్నాయి. ఈక్రమాన తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా కురిసిన వాన పైర్లకు ఊపిరి పోస్తుందని భావిస్తున్నారు. జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతుండగా, పత్తి 2.24 లక్షల ఎకరాల్లో, పెసర 18 వేల ఎకరాల్లో, వరి 42 వేల ఎకరాల్లో సాగైనట్లు అంచనా.


