స్థల సమస్య..
● మధిరకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు ● ఈసారి ఏర్పాటుకు అందుబాటులో లేని భవనాలు ● ఫలితంగా ప్రారంభం, స్థలం ఎంపికపై సందిగ్ధత
మధిర: చింతకాని మండలం మత్కేపల్లిలో ఈ నెల 10న జరిగిన రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వినతితో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుపై ప్రకటన చేశారు. అంతేకాక కాలేజీకి పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యాన వెంటవెంటనే జరుగుతున్న పరిణామాలతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కొనసాగుతుండగా.. రెండో కాలేజీని మధిరలోనే ఏర్పాటు చేస్తారా.. నియోజవర్గంలోని ఇతర ప్రాంతాల్లో అనువైనా స్థలాలను గుర్తిస్తారా అన్నది తేలాల్సి ఉంది. అంతేకాక ఒక దశ ఎపెసెట్ కౌన్సెలింగ్ ఇప్పటికే పూర్తయినందున రెండో దశలో కాలేజీని చేరుస్తారా, వచ్చే ఏడాది నాటికి అంతా సిద్ధం చేసి ప్రారంభిస్తారా అన్నది వెల్లడించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
దూర ప్రాంతాలకు వెళ్లకుండా..
మధిర నియోజకవర్గం ఏపీకి సరిహద్దుగా ఉండడంతో ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో ఇంజనీరింగ్ చదవడానికి హైదరాబాద్ లేదా వరంగల్ వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేట్ యజమాన్య పరిధిలో విజయవాడ, ఖమ్మం ఇతర ప్రాంతాలు ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యాన ఖమ్మం జిల్లాలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కొన్నేళ్ల క్రితం మొదలైనా అందరికీ సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఫలితంగా విద్యార్థులు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరక తప్పడం లేదు. ఈ నేపథ్యాన జిల్లాలో రెండో ప్రభుత్వ కాలేజీ ఏర్పాటు కానుండడంపై హర్షం వ్యక్తమవుతోంది.
ఆరు జూనియర్ కాలేజీలు..
ఏపీ సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లాలో కొన్నేళ్ల క్రితం వరకు ప్రభుత్వ పరిధిలో ఇంజనీరింగ్ విద్య అందుబాటులో లేదు. తొలి కాలేజీ పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటుకాగా, అప్పటివరకు విద్యార్థులు హైదరాబాద్ లేదా వరంగల్ వెళ్లి ఇంజనీరింగ్ చదివారు. మధిర నియోజకవర్గంలో ఆరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, ప్రైవేట్‌తో కలిపితే ఏటా 4వేల నుంచి 5వేల మంది విద్యార్థు లు ఇంటర్ పూర్తి చేస్తున్నారు. ఇంజనీరింగ్ ఎంచుకునేవారు ఎప్‌సెట్ రాస్తుండగా, మధిరలో ప్రభు త్వ కాలేజీ ఏర్పాటైతే ర్యాంకుల ఆధారంగా స్థానికంగా సీటు దక్కించుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే మధిరలో వ్యవసాయ పాలిటెక్నిక్, ప్రభు త్వ పాలిటెక్నిక్ కళాశాలలు కొనసాగుతుండగా, ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీ మంజూరుతో విద్యా ర్థులు, తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు నియోజకవర్గ కేంద్రమైన మధిరలో స్థల సమస్య ఉంది. ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉన్న స్థలంలో ఏరియా ఆస్పత్రి, ఇండోర్ స్టేడియం నిర్మించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో 5.20 ఎకరాల భూమి ఉంది. అయితే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు అన్ని బ్రాంచ్‌ల బోధన సముదాయాలు, సిబ్బందికి క్వార్టర్లు, విద్యార్థుల హాస్టళ్లతో పాటు పరిపాలనా భవనాలు నిర్మించాలి. అన్నింటికీ సుమారు 15 ఎకరాలకు పైగా భూమి అవసరమని అంచనా. ఇంత భూమి మధిర నియోజకవర్గ కేంద్రంలో ఉందా, లేదా అని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరోపక్క ఎర్రుపాలెం మండలంలో అటవీ శాఖకు చెందిన ప్రభుత్వ భూమి ఉంది. కానీ, ఆ భూమి సేకరించాలంటే అటవీ శాఖ అనుమతులు, ప్రత్యామ్నాయ భూమి కేటాయించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగడానికి చాలా సమయం పడుతుంది. దీంతో ప్రైవేట్ భవనాలు అద్దెకు తీసుకుని ఈ ఏడాదే కాలేజీ ఏర్పాటు చేస్తారా.. లేక అన్ని వసతులు సమకూర్చుకుని వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభిస్తారా అన్నది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్ష అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.


